Paytm | దేశంలోని డిజిటల్ పేమెంట్స్ సంస్థల్లో పేరొందిన సంస్థ పేటీఎం.. దాని మాతృసంస్థ `వన్97 కమ్యూనికేషన్స్` కష్టాల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్నది. భారీ అంచనాలతో ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన పేటీఎం జాతకం తిరగబడింది. ఈ ఏడాదిలోనే పేటీఎం షేర్ 60 శాతం వరకు పతనమైంది. ప్రస్తుతం తమ వద్ద రూ.9,182 కోట్ల నగదు లభ్యత మాత్రమే ఉందని పేటీఎం గత త్రైమాసికం ఫలితాల్లో వెల్లడించింది. నిధులను పెంచుకోవడానికి పేటీఎం.. షేర్ల బై బ్యాక్ ప్రకటించే యోచనలో ఉంది. కానీ అక్కడే చిక్కొచ్చి పడింది. కానీ, ఐపీవో ద్వారా వచ్చిన నిధులను షేర్ల బై బ్యాక్‌కు వినియోగించడానికి వీల్లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
తన షేర్ల బై బ్యాక్ విషయమై నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 13వ తేదీన పేటీఎం బోర్డు సమావేశం కానున్నది. తాము ప్రతిపాదిస్తున్న షేర్ల బై బ్యాక్.. తమ వాటాదారులకు లాభదాయకం అవుతుందని గురువారం ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో పేటీఎం ప్రకటించింది. కానీ, గతేడాది ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్టయిన తర్వాత 60 శాతం షేర్ నష్టపోయిన పేటీఎం లాభదాయకతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
కాంపిటీషన్, మార్కెటింగ్ అండ్ ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్లపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఐపీవో ద్వారా సమకూర్చుకున్న నిధులను షేర్ బై బ్యాక్‌కు ఏ కంపెనీ వాడుకోవడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయని అధికార వర్గాల కథనం. ఐపీవో ద్వారా పేటీఎం రూ.18,300 కోట్ల నిధులు సమీకరించింది. వచ్చే 12-18 నెలల్లో నిధులు వెల్లువెత్తుతాయని పేటీఎం గత నెలలో ప్రకటించింది.