Auto Sales | గత నెలలో కార్ల విక్రయాలు పడిపోయాయి. గత రెండున్నరేండ్లలో కార్ల విక్రయాలు తగ్గడం ఇదే మొదటిసారి. కరోనా మహమ్మారి తర్వాత రెండేండ్లకు అన్ని రంగాల్లో ఖర్చులు తగ్గడంతోపాటు డీలర్ల వద్ద భారీగా పెరిగిన నిల్వలు, తగ్గిన డిమాండ్ నేపథ్యంలో జూలై కార్ల విక్రయాలు పడిపోయాయి.
గత నెలలో కార్ల విక్రయాలు 3,44,00-3,45,900 మధ్య జరిగాయి. గతేడాది జూలైలో 3,53,000-3.54 లక్షల మధ్య కార్లు అమ్ముడయ్యాయి. దీని ప్రకారం జూలై నెల కార్ల విక్రయాలు సుమారు 2.5 శాతం పతనం అయ్యాయి. ఇక జూలై నెలాఖరు నాటికి డీలర్ల వద్ద సుమారు 4.07 లక్షల కార్ల నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. 2022 ఫిబ్రవరిలో కార్ల విక్రయాలు 1.8 శాతం తగ్గి 3,02,965 యూనిట్లకు పరిమితం అయ్యాయి.
జూలైలో లీడింగ్ కార్ల తయారీ సంస్థలు మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా, టాటా మోటార్స్ హోల్ సేల్ సేల్స్ తగ్గిపోయాయి. మారుతి సుజుకి 9.6 శాతం తగ్గి 1,37,463 యూనిట్లకు పడిపోతే హ్యుండాయ్ 3.3 శాతం తగ్గి 49,013 కార్లకు పరిమితం అయ్యాయి. టాటా మోటార్స్ సైతం ఆరు శాతం తగ్గి 44,725 కార్ల విక్రయాలు జరిగాయి.
టయోటా కిర్లోస్కర్ మోటార్ 44 శాతం (29,533), మహీంద్రా అండ్ మహీంద్రా 15 శాతం (41,623) కార్ల విక్రయాలు పెరిగాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్ల విక్రయాలు పెరగడమే దీనికి కారణం. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ కార్ల విక్రయాలు 35 శాతం వృద్ధితో 4572 యూనిట్లు అమ్ముడయ్యాయి.
కమర్షియల్ వాహనాల విక్రయాల్లోనూ క్షీణత నమోదైంది. మార్కెట్ లీడర్ టాటా మోటార్స్ సేల్స్ 19 శాతం తగ్గి 25,436 యూనిట్లకు పరిమితం అయ్యాయి. చెన్నై కేంద్రంగా పని చేసే అశోక్ లేలాండ్ వాహనాల సేల్స్ తొమ్మిది శాతం పతనమై 12,926 యూనిట్లకు పడిపోయాయి. మరోవైపు టూ వీలర్స్ సేల్స్ మాత్రం పుంజుకున్నాయి. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ విక్రయాలు 41 శాతం పెరిగి 4,39,118 యూనిట్లకు చేరాయి. టీవీఎస్ మోటార్ రికార్డు స్థాయిలో ఎనిమిది శాతం పెరిగి 2,54,250 యూనిట్లకు, బజాజ్ ఆటో 19 శాతం వృద్ధితో 1,68,847 యూనిట్లకు చేరాయి.