Bandhan Bank | బంధన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా పార్ధ ప్రతిమ్ సేన్ గుప్తా వచ్చేనెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. బంధన్ బ్యాంకు ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో ఈ సంగతి తెలిపింది. బ్యాంక్ ఎండీ కం సీఈఓగా పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా నియామకానికి ఆర్బీఐ ఈ నెలలో ఆమోదం తెలిపింది. దీంతో శుక్రవారం జరిగిన బ్యాంకు డైరెక్టర్ల బోర్డు సమావేశం పార్ధ ప్రతిమ్ సేన్ గుప్తాను బ్యాంకు ఎండీ కం సీఈఓగా నియమించేందుకు ఆమోదం పొందింది. ఈ పదవిలో ఆయన మూడేండ్ల పాటు కొనసాగుతారు. బ్యాంకింగ్ రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం గల పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా.. ఎస్బీఐలో తన కెరీర్ ప్రారంభించారు. అక్కడ వివిధ హోదాల్లో పని చేసి, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ క్రెడిట్ ఆఫీసర్ స్థాయికి పదోన్నతి పొందారు. 2020లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) ఎండీ కం సీఈఓగా కూడా బాధ్యతలు చేపట్టారు.