ఆత్మనిర్భర్ భారత్ అంటూ గొప్పలకు పోయే మోదీ సర్కారు.. కీలక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో మూడు ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. రక్షణ రంగానికి సంబంధించి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడీఎల్ పరిశ్రమలుండగా.. వీటితోపాటు బీహెచ్‌ఎఈల్ ఉన్నదీ ఇక్కడే.
ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు వీటిని స్థాపించారు. అయితే నరేంద్ర మోదీ ఆ పదవిలోకి వచ్చాక ఇవి నిర్వీర్యమైపోతున్నాయి. నష్టాలబాటపట్టి ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అయినప్పటికీ గత పదేండ్లలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రభుత్వం తరఫున ఆర్డర్లిస్తూ ఆదుకున్నారు.

PM Modi | సంగారెడ్డి, జూలై 8 (నమస్తే తెలంగాణ): నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకు గ్రహణం పట్టుకున్నది. ప్రైవేటీకరణ పేరుతో సర్కారీ కంపెనీలు కుదేలయ్యాయి. తెలంగాణ విషయానికే వస్తే.. సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఓడీఎఫ్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) పరిశ్రమలు అధోగతి పాలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ చిన్నచూపుతో కొత్త ఆర్డర్లు లేక నష్టాల్లోకి జారుకున్నాయి. ఉద్యోగాలు లభించక యువత ఇబ్బందులు పడుతున్నది.
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ పరిధిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నది. గతంలో భారత ప్రభుత్వ రంగ సంస్థగా ఉండే ది ఇది. క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, మైన్‌ప్రూఫ్-బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు తయారయ్యేవి. మిలటరీ అవసరాలకు కేంద్రం ఓడీఎఫ్‌కు వరుసగా ఆర్డర్లు ఇచ్చేది. అయితే మోదీ సర్కారు దీన్ని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చింది. ఆర్మ్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్)లోకి చేర్చారు. దీంతో ఆర్డర్లు తగ్గిపోయాయి. గతంలో ఓవర్ డ్యూటీలు చేసే కార్మికులు.. ఇప్పుడు పనిలేక ఉన్న కొలువులు ఎక్కడ ఊడిపోతాయోనన్న భయంతో బతికేయాల్సి వస్తున్నది.
ఆర్డర్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే ఓపెన్ టెండర్లలో పాల్గొని తెచ్చుకోవాలంటూ సూచిస్తోంది. దీని వెనుక కంపెనీని ప్రైవేట్‌పరం చేయాలన్న కుట్ర ఉందన్న విమర్శలు వస్తున్నాయి. 3 వేల మంది కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తు అంధకారంగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జిల్లాలోని భానూరులో బీడీఎల్ పరిశ్రమ ఉన్నది. దీనికీ కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యే చూపిస్తున్నది. ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలే కార్మికులు ఆందోళన సైతం చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో బీహెచ్ఈఎల్ ఉన్నది. దీన్ని ప్రైవేట్‌పరం చేసే కుట్రను మోదీ ప్రభుత్వం పన్నుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 వేల మంది కార్మికులు భెల్‌లో పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమలో గ్యాస్ టర్బైన్లు, ఆయిల్ రిగ్గులు, కంప్రెషర్లు, బాయిలర్లు, హీటర్లు, భారీ పంపులు తయారవుతాయి. మోదీ గద్దెనెక్కిన తర్వాత ప్రభుత్వ ఆర్డర్లు కరువయ్యాయి. వేలాది కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిన బీహెచ్ఈఎల్.. నష్టాల బాటపట్టింది.
మూడేండ్ల క్రితం అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేయూతనివ్వడంతో ప్రస్తుతం భెల్ లాభాలను ఆర్జిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంపుల ఆర్డర్లను బీహెచ్‌ఈఎల్‌కే ఇచ్చారు. అలాగే తెలంగాణలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్తు ప్రాజెక్టులకు సంబంధించి మిషనరీ ఆర్డర్ కూడా దక్కింది. బీహెచ్ఈఎల్ మనుగడకు నాటి సీఎం కేసీఆర్ నిర్ణయాలే కారణమని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయిప్పుడు. మొత్తానికి ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రైవేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తున్నారని కార్మిక నాయకులు మండిపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ రంగ సంస్థలు మూతబడేలా చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.