న్యూఢిల్లీ: దిగ్గజ టెకీ కంపెనీ ఒరాకిల్ కూడా లేఆఫ్స్(Oracle Layoffs) ప్రకటించింది. సుమారు 20 వేల మంది ఆ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. సోమవారం ఆ కంపెనీ ఈ ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 30 వేల మందిని తొలిగించే అవకాశాలు ఉన్నట్లు చెప్పింది. ఇవాళ ఉదయం పంపిన ఈ-మెయిల్స్ ద్వారా ఈ విషయాన్ని ఉద్యోగులకు చేరవేశారు. అమెరికా, ఇండియా, కెనడా, లాటిన్ దేశాల్లో ఉన్న ఒరాకిల్ కంపెనీ ఉద్యోగులపై భారీ వేటు పడనున్నది. ఒరాకిల్ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్లను కూడా తొలగిస్తున్నారు. 33 ఏళ్లుగా ఒరాకిల్ లో చేసిన సీనియర్ సెక్యూర్టీ ప్రొఫెషనల్ నీనా లివస్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోనున్నారు.
30 వేల మంది లేఆఫ్స్‌లో తాను కూడా ఉండబోనున్నట్లు ఆమె తన లింక్డిన్ ప్రొఫైల్‌లో రాశారు. తమ కంపెనీ తీసుకున్న నిర్ణయం షాకింగ్‌గా ఉన్నట్లు ఆమె చెప్పింది. కృత్రిమ మేధ ప్రభావం సీనియర్ల ఉద్యోగులపై పడుతున్నట్లు ఆమె తన పోస్టులో అభిప్రాయపడ్డారు. 1990లో లివిస్ ఆ కంపెనీలో చేరారు. డేటాబేస్, సెక్యూర్టీ ప్లాట్‌ఫామ్‌లపై ఆమె పనిచేశారు. ఇటీవల సెక్యూర్టీ అలర్ట్ మేనేజర్‌గా చేశారు. ఇంజినీరింగ్ , సెక్యూర్టీ టీమ్‌లతోనూ ఆమె పనిచేశారు. ఒరాకిల్ కంపెనీలో ప్రిన్సిపల్ ఎథికల్ హ్యాకర్, ప్రిన్సిపల్ సెక్యూర్టీ అనలిస్టుగా లివిస్ చేశారు.
సీనియర్ ఉద్యోగులను టార్గెట్ చేసినట్లు భావిస్తున్నానని ఆమె తన పోస్టులో తెలిపారు. లేఆఫ్స్‌లో సంఖ్య కన్నా.. సీనియర్ల తొలగింపు ప్రశ్నార్ధకంగా మారింది. సుదీర్ఘకాలం కంపెనీలో పనిచేస్తున్నవారు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ప్రభావం పడడం శోచనీయంగా మారింది. ఇటీవల మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ, ఏఎస్ఎంఎ కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటించాయి. మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు గత వారంలో 20 వేల ఉద్యోగులను తొలగించాయి.
ప్రస్తుత దశలో చాలా వరకు కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై భారీగా పెట్టుబడి పెడుతున్నాయి. పనివిధానాలను ఆటోమెట్ చేయడంలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. వర్కింగ్ టీమ్స్‌ను పునర్ నిర్మిస్తున్నారు. అయితే అధిక సామర్థ్యం, తక్కువ ఇన్పుట్, ఎక్కువ లాభాలు అన్న రీతిలో కంపెనీలు పనిచేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లాభాలపై దృష్టి పెట్టిన కంపెనీలు.. భారీ వేతనపరులు అవసరమా అన్న రీతిలో ఆలోచిస్తున్నాయి. అయితే వీరి స్థానంలో ఏఐతో పాటు యువ ఉద్యోగులను నియమించేందుకు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఎంట్రీ లెవల్ జాబ్‌లను పూర్తిగా ఆటోమేట్ చేశారు. దీంతో కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారికి సమస్యలు మరింత అధికమవుతున్నాయి. టాప్ కంపెనీలన్నీ దాదాపు ఫ్రెషర్స్‌కు అవకాశాలు ఇవ్వడం లేదని సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రౌషన్ సింగ్ తెలిపారు. కేవలం అవసరాన్ని బట్టి హైరింగ్ జరుగుతోందన్నారు. మిడ్, సీనియర్ లెవల్ ఇంజినీర్లు సామర్థ్యాన్ని పెంచేందుకు ఏఐపై ఆధారపడుతున్నారని, దీని వల్ల సర్వీస్‌తో పాటు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు కొత్తవారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాయన్నారు.
ఇక గతంలో సురక్షితమని భావించిన మేనేజర్, డైరెక్టర్ స్థాయి ఉద్యోగాలు ఇప్పుడు గ్యారెంటీ లేకుండా ఉన్నాయి. ప్రస్తుత దశలో ఒక్క కాలేజీ కూడా 100 శాతం ప్లేస్మెంట్ గ్యారెంటీ ఇవ్వడం లేదని గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పీడీడీఎం డైరెక్టర్ డాక్టర్ పూర్ణిమా గుప్తా అభిప్రాయపడ్డారు. కొత్త గ్రాడ్యుయేట్లు అనుభవం కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నట్లు చెప్పారు. కాస్ట్ కట్టింగ్ దశ నుంచి ఇప్పుడు ఏఐ ఫస్ట్ ఫ్యూచర్ అన్న రీతిలో కంపెనీలు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఒరాకిల్ కంపెనీ ఎక్కువగా క్లౌడ్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టుబడి పెడుతోంది. వర్క్‌ఫోర్స్‌ను రిడీజైన్ చేస్తున్నది. దీనిలో భాగంగానే సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్యోగులను తొలగిస్తున్నారు. టెక్నాలజీకి పెద్దపీట వేయడంతో.. ఆటోమేషన్ పెరిగిపోయిందని, లాభాలపై దృష్టిపెట్టడం వల్లే లేఆఫ్స్ కూడా అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.