శంషాబాద్ రూరల్, డిసెంబర్ 7: అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా హైదరాబాద్ పురోగమిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో శాటిలైట్ భవనంలో ఒడిస్సి లాజిస్టిక్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో మూడో వంతు ఔషధ కంపెనీలు హైదరాబాద్లో ఉండటానికి భౌగోళిక అనుకూలతలతోపాటు ఇక్కడి మెరుగైన రవాణా సదుపాయాలే కారణమని పేర్కొన్నారు. ఇక ఫార్మా రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నందున తమ సంస్థ కార్యకలాపాలను ఇక్కడ గత ఐదేండ్లుగా కొనసాగిస్తున్నామని ఒడిస్సి లాజిస్టిక్ ఎండీ అభిషేక్ ఠాగూర్ అన్నారు. లాజిస్టిక్ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో మేనేజర్ గంగాధర్, ఉద్యోగులు పాల్గొన్నారు.