Google-Open AI ChatGPT | ఇప్పటి వరకూ అంతర్జాతీయంగా, జాతీయంగా మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలంటే సెర్చింజన్ ‘గూగుల్’ శరణ్యం.. ‘గూగులమ్మ’.. ’గూగుల్ తల్లి’ని అడిగేస్తే ఏ విషయమైనా తెలుస్తుందని చెబుతుంటారు. దశాబ్దాల తరబడి ఇంటర్నెట్ రంగంలో ‘సెర్చింజన్’గా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’కు గట్టి పోటీ ఎదురవుతోంది. అదీ ఒక స్టార్టప్ సంస్థ నుంచి పోటీ వస్తోంది. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్ బోట్ కీలకంగా మారింది.
మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెన్ను దన్నుతో ఏఐ బేస్డ్ చాట్‌జీపీటీ ని ఓపెన్ ఏఐ (Open AI) అనే స్టార్టప్ సంస్థ రెండేండ్ల క్రితం వెలుగులోకి తీసుకొచ్చింది. వచ్చీ రావడంతోనే సంచలనాలు క్రియేట్ చేసింది ఓపెన్ ఏఐ.. చాట్‌జీపీటీ. ప్రతి అంశంపైనా అథంటిక్ సమాచారాన్ని అందిస్తూ గూగుల్‌కు పోటీగా నిలిచింది.
తాజాగా గూగుల్‌తో పోటాపోటీ సమాచారం నెటిజన్లకు అందించేందుకు సెర్చింజన్ సామర్థ్యంతో కూడిన ఏఐ చాట్‌బోట్‌ను ఆవిష్కరిస్తోంది చాట్‌జీపీటీ జనరేటివ్. సంబంధిత వెబ్ సోర్సెస్ కూడిన లింకులతో శేరవేగంగా, సమయానుకూల సమాధానాలు ఇచ్చేలా ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ జనరేటివ్‌ను అప్ గ్రేడ్ చేస్తున్నది. ఇంతకు ముందు అందుబాటులో ఉన్న సంప్రదాయ సెర్చింజన్ నుంచే వెబ్ సోర్సెస్ ఉపయోగించుకోనున్నది ఓపెన్ ఏఐ.
చాట్‌జీపీటీ హోమ్ పేజ్ యూజర్లకు అవసరమైన టాపిక్స్ మీద నేరుగా ట్యాబ్ ఆప్షన్లు అందిస్తుంది. వాతావరణ పరిస్థితులు, వివిధ స్టాక్స్ ధరలు, స్పోర్ట్స్ స్కోర్లు, బ్రేకింగ్ న్యూస్ తదితర విషయాలపై ట్యాబ్స్ ఉంటాయని ఓపెన్ ఏఐ తెలిపింది. చాట్‌జీపీటీతో అవసరమైన సమాచారం కోసం ఓపెన్ ఏఐతో ఫ్రాన్స్ లీ మొండె, జర్మనీ యాక్సెల్ స్ప్రింగర్, బ్రిటన్ ఫైనాన్సియల్ టైమ్స్ తదితర సంస్థలు కంటెంట్ డీల్ పై సంతకాలు చేశాయి. చాట్‌జీపీటీ.కామ్ వెబ్ సైట్ తోపాటు మొబైల్ యాప్ లోనూ ఈ ఫెసిలిటీ లభిస్తుందని ఓపెన్ ఏఐ వెల్లడించింది.
చాట్‌జీపీటీ ప్లస్, చాట్‌జీపీటీ టీమ్ యూజర్లు, సెర్చ్ జీపీటీ వెయిట్ లిస్ట్ యూజర్లకు ఈ సౌకర్యం తక్షణం అందుబాటులోకి తెస్తున్నమని పేర్కొంది. కొన్ని వారాల్లో ఎంటర్ ప్రైజెస్, ఎడ్యుకేషనల్ యూజర్లకు అందుబాటులోకి వస్తున్న ఈ సౌకర్యం.. చాట్‌జీపీటీని ఫ్రీగా వాడుకునే యూజర్లకు చేరువ చేయడానికి కొన్ని నెలల టైం పడుతుందని ఓపెన్ ఏఐ వివరించింది.