(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా విమానమెక్కాలనుకుంటారు. ఆకాశ మార్గాన విహరించాలని కోరుకుంటారు. అయితే ఈ సంకల్పంతో ప్రారంభించిన ఉడాన్ పథకం అమలు.. ఆశించిన స్థాయిలో లేదంటూ కేంద్ర ప్రభుత్వానికి కాగ్ అక్షింతలేసింది. ఆర్భాటంతో ప్రారంభించిన ఈ పథకం కింద అనుకున్న లక్ష్యం ప్రకారం సగం కంటే ఎక్కువ మార్గాలలో కూడా విమాన సర్వీసులు నడిపించలేకపోయారని తప్పుబట్టింది. 774 రూట్లలో విమాన సర్వీసులు నడిపించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ అందులో 48 శాతం రూట్లలో (371 రూట్లలో) మాత్రమే విమాన సేవలు అందించగలిగారని, 52 శాతం రూట్లలో (403 మార్గాలలో) విమాన సేవలు అందించలేకపోయినట్టు కాగ్ (కంట్రోలర్ ఆడిటర్ జనరల్) తన నివేదికలో పేర్కొంది. విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 10రెట్లు పెరిగినా, ఆ స్థాయిలో విమాన సేవలు మాత్రం పెరగలేదని మొట్టికాయలేసింది. ప్రజల నుంచి ఈ పథకానికి సానుకూలంగా స్పందన వచ్చినప్పటికీ లక్ష్యాలను సాధించటంలో విఫలమయ్యారన్నది. ఈ పథకం మెరుగుపర్చడానికి, మరిన్ని విమాన సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కాగ్ ఈ సందర్భంగా 16 సిఫార్సులను కూడా చేసింది.