Robin Liu : ప్రముఖ స్మార్ట్ఫోన్ (Smart Phone) తయారీ సంస్థ వన్ప్లస్ (One Plus) ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రాబిన్ లియు (Robin Liu) తన పదవి నుంచి తప్పుకున్నట్లుగా కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీ తన వ్యాపార నిర్మాణాన్ని మారుస్తున్న తరుణంలో ఈ మార్పు చోటుచేసుకుంది.
రాబిన్ లియు 2018లో వన్ప్లస్ ఇండియా సంస్థలో చేరారు. తన వ్యక్తిగత ఆసక్తుల కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ తెలిపింది. ఇండియాలో వన్ప్లస్ వృద్ధికి ఆయన చేసిన కృషిని కంపెనీ కొనియాడింది. అయితే, రాబిన్ లియు రాజీనామాతో ఇండియాలో వన్ప్లస్ కార్యకలాపాలు నిలిచిపోతాయన్న ఊహాగానాలను కంపెనీ తోసిపుచ్చింది.
‘వన్ప్లస్ ఇండియా’ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని, వ్యాపార కొనసాగింపులో ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేసింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. రాబిన్ లియును ‘రియల్ మీ’ సీఈవో స్కై లీకి రిపోర్ట్ చేయాలని ఒప్పో గ్రూప్ కోరినట్లుగా తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ సమాన హోదాలో ఉండేవారు.
ఇప్పుడు ఒప్పో సబ్-బ్రాండ్ల బాధ్యతలను స్కై లీకి అప్పగించడంతో ఈ మార్పు వచ్చినట్లుగా సమాచారం.
మరోవైపు 2025లో వన్ప్లస్ షిప్మెంట్లు దాదాపు 32 శాతం నుంచి 38 శాతం వరకు తగ్గినట్లు మార్కెట్ పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. ప్రీమియం విభాగంలో గట్టి పోటీ ఎదురవ్వడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.