ముంబై, నవంబర్ 17: గేమింగ్ ఇండస్ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ఒక లక్ష కొత్త ఉద్యోగాలను అందిపుచ్చుకోగలదని టీమ్‌లీజ్ డిజిటల్ అంచనా వేసింది. ‘గేమింగ్: టుమారోస్ బ్లాక్‌బస్టర్’ పేరుతో ఓ నివేదికను టీమ్‌లీజ్ డిజిటల్ తాజాగా విడుదల చేసింది. ఇందులో గేమింగ్ ఇండస్ట్రీ 20-30 శాతం వృద్ధిని సాధించే వీలున్నదని, ఈ క్రమంలోనే ప్రోగ్రామింగ్, టెస్టింగ్, యానిమేషన్, డిజైన్, ఆర్టిస్ట్ తదితర విభాగాల్లో వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా లక్ష కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కంటెంట్ రైటర్స్, గేమింగ్ జర్నలిస్టులు, వెబ్ అనలిస్టులకు మంచి డిమాండ్ ఉందన్నది. ఏటా రూ.5 లక్షల నుంచి 10 లక్షలదాకా జీతాలు లభించే అవకాశాలున్నట్టు చెప్పింది. ఇక ప్రస్తుతం దాదాపు 50వేల మంది ఈ పరిశ్రమలో ప్రత్యక్ష ఉపాధిని పొందుతున్నారని, వీరిలో 30 శాతం మంది ప్రోగ్రామర్లు, డెవలపర్లేనని తెలిపింది.