
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఈ ఏడాది ఇప్పటికే రెండు దఫాలు ధరల్ని పెంచిన వినియోగ ఉత్పత్తుల కంపెనీలు, ఇతర తయారీ కంపెనీలు కొత్త ఏడాదిలో మరో రౌండ్ ధరల్ని పెంచేందుకు సిద్దమవుతున్నాయి. ముడి పదార్థాలు, రవాణా వ్యయాలు అధికమయ్యాయని చెపుతూ ఈ ఏడాదిలో కార్ల నుంచి షాంపూల వరకూ అన్నింటి ధరల్నీ పెంచివేశాయి. అమ్మకాలు తగ్గినా, 2022 జనవరి-మార్చి త్రైమాసికంలో మరో దఫా 4 నుంచి 10 శాతం వరకూ ధరల్ని పెంచాలని సోప్స్ నుంచి బిస్కెట్ల వరకూ విక్రయించే వివిధ ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు చూస్తున్నాయి. క్రూడ్, పామాయిల్, ప్యాకేజింగ్ వ్యయాలు ఏడాదికాలంలో రెట్టింపుకావడంతో టాప్ ఎఫ్ఎంసీజీ కంపెనీలైన హిందుస్తాన్ యూనీలీవర్, డాబర్, బ్రిటానియా, మారికో, ఐటీసీలు గత రెండు త్రైమాసికాల్లో 5-12 శాతం మధ్య ధరల్ని పెంచాయి. కొన్ని ఉత్పత్తుల ధరల్ని నేరుగా పెంచకుండా, ఆయా ప్యాక్‌ల పరిమాణాన్ని (తక్కువ గ్రాములతో ఉత్పత్తిని ప్యాక్ చేయడం) తగ్గించడం ద్వారా పరోక్షంగా వినియోగదారుల మీద భారం మోపాయి. ఇలా పరోక్షంగా ధరలు పెంచినా తమ లాభాల మార్జిన్లు తగ్గాయని, ఈ కారణంగా వచ్చే త్రైమాసికంలో మరో 4-5 శాతం మేర ధరల్ని పెంచుతామని పార్లే ప్రొడక్ట్స్ క్యాటగిరీ హెడ్ కృష్ణారావు బుద్దా చెప్పారు. ద్రవ్యోల్బణం తగ్గనిపక్షంలో ఈ నాల్గో త్రైమాసికంలో మరో రౌండు ధరల పెంపు తప్పదని డాబర్ సీఈవో మొహిత్ మల్హోత్రా అన్నారు.
వాహన కంపెనీలు ఇదే బాటలో…
ఆటోమోబైల్ కంపెనీలు..మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్, మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వాగన్, టొయోటా, హీరో మోటోలు ఈ ఏడాది పలుమార్లు ధరల్ని పెంచుతూపోయాయి. అధికమైన ముడి ఉత్పత్తుల వ్యయాల్ని వినియోగదారులకు మళ్లించేక్రమంలో కొత్త ఏడాదిలో ధరల్ని పెంచనున్నట్లు మారుతి ఇప్పటికే వెల్లడించింది. ఏడాదికాలంలో మూడు దఫాలు, గత 18 నెలల్లో ఐదుసార్లు ఈ కంపెనీ ధరల్ని పెంచింది. పెరిగిన వ్యయాలతో పోలిస్తే తాము పెంచింది చాలా తక్కువని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. అయితే ఉక్కు, రాగి, ప్లాస్టిక్, అల్యూమినియం తదితర ముడి పదార్థాల ధరలు అనూహ్యంగా అధికమయ్యాయని, అందులో కొంత తాము వినియోగదారులకు మళ్లించక తప్పదన్నారు. అలాగే జవవరి 4న తమ వాహన ధరల్ని రూ. 2,000 వరకూ పెంచనున్నట్లు హీరో మోటో కూడా ప్రకటించింది. ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా వాటి ధరల పెంపును వచ్చే కొద్దిరోజుల్లో వెల్లడించవచ్చని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.
వినియోగ వస్తువులు సైతం…
ఈ డిసెంబర్ నెలలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ ఎండీషనర్ల ధరల్ని 3-5 శాతం మధ్య పెంచిన కన్జూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు వచ్చే నెల నుంచి ఇంకో 6-10 శాతం మేర ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాయన్నది సమాచారం. 2020 డిసెంబర్ నుంచి చూస్తే ఈ కంపెనీలు తదుపరి పెంపు నాల్గవ రౌండ్ అవుతుంది. ధరల పెంపునకు సంబంధించి ఈ పరిశ్రమలో ఇది రికార్డ్ కానుంది. ఉక్కు, రాగి, అల్యూమినియం తదితర లోహాలతో పాటు ప్లాస్టిక్, విడిభాగాల ధరలు రికార్డు గరిష్ఠస్థాయిలో ఉన్నాయని, అలాగే రవాణా వ్యయాలు, రూపాయి మారకపు విలువ భారంగా మారాయని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. ఈ వ్యయాల్ని తట్టుకోవడానికి తమ ఉత్పత్తుల ధరల్ని మరో దఫా పెంచక తప్పదన్నారు.