IT Returns | గత ఆర్థిక సంవత్సరం (2024-25 అంచనా సంవత్సర) ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ నెల 31 తుది గడువు. అడిటింగ్ అవసరం లేని వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులు ఈ గడువు లోపు తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. గడువు దాటిన తర్వాత కూడా ‘బీలేటెడ్ ఐటీఆర్’ ఫైల్ చేయొచ్చు. కానీ, ఇక్కడో ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం పాత ఆదాయం పన్ను విధానం, కొత్త ఆదాయం పన్ను విధానం అమల్లో ఉన్నాయి. వాటిల్లో కొత్త ఆదాయం పన్ను విధానాన్ని కేంద్రం ‘డీఫాల్ట్’గా పెట్టింది. ఒకవేళ పాత ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకునే ట్యాక్స్ పేయర్లు.. మాత్రం ఈ నెల 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. గడువు దాటిన తర్వాత ‘బీలేటెడ్ ఐటీఆర్’ ఫైల్ చేసినా పన్ను మినహాయింపులు క్లయిమ్ చేయలేరు. దీనికి తోడు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాన్ని బట్టి.. కొత్త ఆదాయం పన్ను శ్లాబ్‌ల ప్రకారం పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఆదాయం పన్ను చట్టం-1961లోని 234ఏ సెక్షన్ ప్రకారం ‘బీలేటెడ్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే రూ.5000 వరకూ పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు.
ఉదాహరణకు మీ స్థూల ఆదాయం రూ.13 లక్షలు అనుకుందాం. మీరు పాత ఆదాయం పన్ను విధానం కింద ఐటీఆర్ ఫైల్ చేస్తే రూ.3.75 లక్షల వరకూ పన్ను మినహాయింపులు క్లయిమ్ చేయొచ్చు. దీని ప్రకారం రూ.9.25 లక్షల ఆదాయంపై పన్ను పే చేయాల్సి రావచ్చు. పాత ఆదాయం పన్ను విధానంలో సెస్ తో కలిపి రూ.1,01,400 పన్ను పే చేయాలి. ఇది ఈ నెల 31న గానీ, అంతకంటే ముందే ఐటీఆర్ ఫైల్ చేసిన వారికి వర్తిస్తుంది.
నూతన ఆదాయం పన్ను విధానం కింద రూ.1,14,400 పన్ను చెల్లించాలి. గడువు దాటిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే అదనంగా రూ.5000 పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసే నాటికి పన్నుపై వడ్డీ కూడా పే చేయాల్సి వస్తుంది. కనుక గడువు దాటిన తర్వాత ‘బీలేటెడ్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే మీరు కనీసం రూ.18 వేలు నష్టపోతారు. అంతే కాదు ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దాన్ని నెల రోజుల్లోపు వెరిఫై చేసుకోవాలి.
ఉదాహరణకు ఈ నెల 31న మీరు ఐటీఆర్ ఫైల్ చేశారనుకుందాం.. దాన్ని ఆగస్టు 30 లోపు తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి. ఐటీఆర్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఏ పొరపాటు జరిగినా రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటది. రివైజ్డ్ ఐటీఆర్ కూడా 2024 డిసెంబర్ 31 లోపు తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.