Ola Parcel | ప్రముఖ క్యాబ్స్ అగ్రిగేటర్ ఓలా.. తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. తాజాగా పార్సిల్ డెలివరీ రంగంలోకి ఎంటరైంది. ఇప్పటివరకూ కస్టమర్లకు రైడ్ సేవలు మాత్రమే అందిస్తూ వచ్చింది. ఇక పార్శిళ్లను కస్టమర్లకు బట్వాడా చేయనున్నది. ఇందుకోసం ‘ఓలా పార్సిల్’ అనే పేరుతో డెలివరీ సేవలు ప్రారంభించింది. తొలుత బెంగళూరు వాసులకు ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. స్విగ్గీ ఆధ్వర్యంలోని జెనీస్, రిలయన్స్ మద్దతుతో పని చేస్తున్న డుంజో సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది.
‘బెంగళూరులో ఓలా పార్సిల్ సేవలు ప్రారంభించాం. ఈ పార్సిళ్ల డెలివరీకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే వినియోగిస్తాం` అని ఓలా కో-ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు. ఐదు కి.మీ. దూరానికి రూ.25, 15 కి.మీ దూరానికి రూ.75, 20 కి.మీ దూరానికి రూ.100 చార్జీలు వసూలు చేస్తామన్నారు. ప్రస్తుతం బెంగళూరుకు పరిమితమైన ఓలా పార్సిల్ సేవలు.. దేశంలోని అన్ని నగరాలకు విస్తరిస్తామని ఓలా తెలిపింది. స్విగ్గీ డెలివరీ సంస్థ జెనీ`స్.. రెండు కిలోమీటర్ల దూరంలో పార్సిల్ డెలివరీ కోసం రూ.60 చార్జీ వసూలు చేస్తోంది. సరకుల రవాణాను పూర్తిగా విద్యుద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భవిష్ అగర్వాల్ తెలిపారు. తక్కువ ధరకే డెలివరీ సర్వీస్ సొల్యూషన్ తీసుకు రావడమే తమ లక్ష్యం అని చెప్పారు.