Ola Electric | ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా, ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ మధ్య సోషల్ మీడియాలో తలెత్తిన వివాదం.. ఓలా ఎలక్ట్రిక్ షేర్ భారీ పతనానికి కారణమైంది. ఐపీఓ ద్వారా ఇటీవలే దేశీయ స్టాక్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్ అయింది. కానీ, ఓలా ఎలక్ట్రిక్ తన స్కూటర్ల సర్వీసింగ్ తదితర సేవలపై సోషల్ మీడియాలో కస్టమర్లు చేస్తున్న ఫిర్యాదులపై కునాల్ కమ్రా.. ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో పోస్ట్ పెట్టడంతో వివాదం మొదలైంది. ఇటీవల 48 శాతం పతనమైన ఓలా ఎలక్ట్రిక్ షేర్ సోమవారం ఎన్ఎస్ఈలో 8 శాతం నష్టంతో రూ.90.37 వద్ద ట్రేడయింది.
ఓలా ఎలక్ట్రిక్ సంస్థలకు తగినన్ని సర్వీస్ సెంటర్లు లేవని, ఫలితంగా కస్టమర్లు విసుగెత్తి పోతున్నారని కునాల్ కమ్రా చేసిన పోస్టుపై భవిష్ అగర్వాల్ రియాక్టయ్యారు. మీ కామెడీ కెరీర్ పూర్తి కాగానే ఇలా పెయిడ్ పోస్టులు పెడుతున్నావని అంటూ.. తమ ఓలా సర్వీస్ స్టేషన్ వద్ద డ్యూటీ చేస్తే కామెడీ షోలతో వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఇస్తానంటూ ప్రతిగా పోస్టు పెట్టారు. కునాల్ కమ్రా కూడా అసంతృప్తిగా ఉన్న కస్టమర్లకు పూర్తిగా రీఫండ్ చేస్తారా అంటూ.. భవిష్ అగర్వాల్‌ను సవాల్ చేశారు.
ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమేడియన్ కునాల్ కమ్రా మధ్య నెటిజన్లు తమ అభిప్రాయాలు షేర్ చేశారు. కస్టమర్ల ఇబ్బందులను పట్టించుకోకుండా ఓ కమేడియన్తో వాదనకు దిగడం సరి కాదంటూ భవిష్ అగర్వాల్ తీరును కొందరు నిరసించారు. కునాల్ కమ్రా వంటి వ్యక్తుల పోస్టులు పట్టించుకోవద్దని మరికొందరు వ్యాఖ్యానించారు.