Ola Electric | దేశంలో 50 గిగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ సెల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణం కోసం ఓలా ఎలక్ట్రిక్ చర్చలు జరుపుతున్నది. పలు అంతర్జాతీయ సంస్థలు, సరఫరా దారులతో ఈ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏటా 10 మిలియన్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేయాలంటే ఓలా ఎలక్ట్రిక్‌కు 40 గిగావాట్ల బ్యాటరీ సామర్థ్యం అవసరం.
ఈ బ్యాటరీ సెల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి సుమారు ఒక బిలియన్ (రూ.7,700 కోట్లు) డాలర్లు ఖర్చవుతుందని అంచనా. ప్రారంభ దశలో ఒక గిగావాట్ సామర్థ్యం గల బ్యాటరీ సెల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మించి.. తదుపరి విస్తరించాలని యోచిస్తున్నట్లు వినికిడి.
ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్-సీఈవో భవిష్ అగర్వాల్‌తో చర్చలు జరిపేందుకు 40కిపైగా గ్లోబల్ సప్లయర్లు బెంగళూరు చేరుకున్నారు. ఈ వారంలోనే తమిళనాడులోని కృష్ణగిరిలో గల ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని ఆయా సంస్థల ప్రతినిధులు సందర్శిస్తారని సమాచారం.
జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్‌తోపాటు బ్యాటరీ ఉత్పత్తి ఆకాంక్ష గల సంస్థలతో ఓలా ఎలక్ట్రిక్ తొలుత చర్చలు జరిపింది. ప్రస్తుతం దక్షిణ కొరియా నుంచి బ్యాటరీ సెల్స్ దిగుమతి చేసుకుంటున్నది. బ్యాటరీ సెల్స్ సరఫరాదారుల జాబితాలో డీఆర్ఆర్ ( Drr ), సీమెన్స్ ( Siemens ) ఉన్నాయి.