రూ.1,487 కోట్ల నిధులు సమీకరించిన కంపెనీ
ముంబై, సెప్టెంబర్ 30: ఇటీవల రికార్డుస్థాయిలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన ఓలా ఎలక్ట్రిక్ విలువ 3 బిలియన్ డాలర్లకు (రూ.22,272 కోట్లు) చేరింది. ఈ కంపెనీ తాజాగా అంతర్జాతీయ ఫండ్స్ ఫాల్కన్ ఎడ్జ్, సాఫ్ట్‌బ్యాంక్, ఇతరుల నుంచి 200 మిలియన్ డాలర్లు (రూ.1,487 కోట్లు) సమీకరించింది. ఓలా ఎలక్ట్రిక్‌కు 3 బిలియన్ డాలర్ల విలువను అపాదిస్తూ తాజా పెట్టుబడులు జరిగాయి. అలాగే 10 సంవత్సరాల కాలపరిమితితో 100 మిలియన్ డాలర్ల (రూ.744.5 కోట్లు) రుణాన్ని పొందేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఈ నిధుల సమీకరణతో ఎలక్ట్రిక్ మోటార్‌బైక్, మాస్మార్కెట్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్లను అభివృద్ధిపర్చడాన్ని వేగవంతం చేస్తామని ఓలా ఎలక్ట్రిక్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 2025 తర్వాత ఇండియాలో పెట్రోల్ ద్విచక్ర వాహనాల విక్రయం జరక్కూడదన్న లక్ష్యంతో తాము ఎలక్ట్రిక్ వాహనాల్ని విరివిగా ఉత్పత్తిచేయడానికి తాజా నిధులు ఉపకరిస్తాయని ప్రకటన పేర్కొంది. ప్రపంచానికంతటికీ భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన టెక్నాలజీల్ని ఇచ్చే సామర్థ్యం, ప్రతిభ ఇండియాకు ఉన్నదని ఓలా చైర్మన్ భవిష్ అగర్వాల్ చెప్పారు.
సెప్టెంబర్ తొలినాళ్లలో వోలా ఎలక్ట్రిక్& ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేవలం రెండు రోజుల్లో రూ.1,100 కోట్ల విలువైన స్కూటర్లను కంపెనీ విక్రయించింది. వినియోగదారులు స్కూటర్ల కొనుగోలుకు విండోను నవంబర్ నెలలో పునర్ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. తమిళనాడులో పూర్తిగా మహిళలే నడిపే ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంటును ఓలా ఏర్పాటుచేసింది. తొలిదశలో ఈ ప్లాంటు నుంచి సంవత్సరానికి 10 లక్షల యూనిట్లు ఉత్పత్తవుతాయని, తర్వాత ఈ సామర్థ్యాన్ని 20 లక్షల యూనిట్లకు పెంచుతామని గతంలో కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాంటు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఏడాదికి ఒక కోటి స్కూటర్లను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది.