Ola Electric Bike | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)’ తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్’ను ఈ నెల 15న ఆవిష్కరించనున్నది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు నిర్వహించే ‘సంకల్ప్ 2024’ వేడుకలో ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ కం ఫౌండర్ భవిష్ అగర్వాల్ ఆవిష్కరిస్తుందని సమాచారం. ఇప్పటికే మార్కెట్లో విడుదలైన ఓలా ఎస్1ఎక్స్, ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో స్కూటర్ల సరసన ఈ ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ చేరనున్నది. ఈ నెల 15న ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ను ఆవిష్కరిస్తామని ధృవీకరించింది. వచ్చే ఆరు నెలల్లో సదరు ఎలక్ట్రిక్ మోటారు సైకిల్స్ విక్రయం ప్రారంభం అవుతాయని తెలుస్తోంది.
టోర్క్ క్రటోస్ ఆర్, రివోల్ట్ ఆర్వీ 400, ఆల్ట్రావయోలెట్ ఎఫ్77 2, మాస్టర్ ఏరియా వంటి ఈవీ మోటారు సైకిళ్లతో పోటీ పడనున్నది. ఫ్రంట్ ఫేసియాలో డ్యుయల్ పాడ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, టాప్ పై హరిజొంటల్ ఎల్ఈడీ స్ట్రిప్, పక్కన రెండు వెర్టికల్ స్ట్రిప్స్ తదితర ఫీచర్లు ఉంటాయి. సంప్రదాయ సైడ్ అప్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, ట్యూబులర్ ఫ్రేమ్ తో కూడిన లార్జ్ బ్యాటరీ, చైన్ ఫైనల్ డ్రైవ్ వంటి ఫీచర్లు కూడా వాడతారు. తమిళనాడులోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఈ నెల 15న స్వాంతత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయి.