ముంబై: ఒకాయ ఎలక్ట్రిక్ వెహికిల్స్ తమ హై-స్పీడ్ ఈ-స్కూటర్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ‘ఫాస్ట్’ పేరుతో వచ్చిన దీని పరిచయ ధర రూ.89,999 (సబ్సిడీలకు ముందు)గా ఉన్నట్టు శుక్రవారం ఒకాయ పవర్ గ్రూప్ ఎండీ అనిల్ గుప్తా తెలిపారు. గ్రేటర్ నోయిడా వద్ద జరుగుతున్న ఈవీ ఎక్స్పో 21లో దీన్ని ప్రదర్శించారు. కాగా, ఒకాయ ఈవీ వెబ్సైట్ లేదా డీలర్‌షిప్‌ల వద్ద రూ.1,999 చెల్లించి స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. 60-70 కిలోమీటర్ల గరిష్ఠ వేగం కలిగిన ఈ స్కూటర్.. ఒక్క చార్జింగ్‌పై 150-200 కి.మీ. ప్రయాణించగలదు. 4.4 కిలోవాట్ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ, సరికొత్త ఎల్ఈడీ లైట్లు, డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్, డేటైమ్ రన్నింగ్ లైట్లు, కాంబీ బ్రేకింగ్ వ్యవస్థ దీని సొంతం.