న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఐదు నెలల గరిష్ట స్థాయికి (Oil Prices Jump) చేరాయి. దీంతో ఆసియా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే. దీంతో మధ్యప్రాచ్యంలో తీవ్ర సంక్షోభం చోటుచేసుకున్నది. ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయించింది. దీనికి ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ విషయంపై దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో చమురు సరఫరాపై సవత్రా ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో పెట్టుబడిదారులు టెహ్రాన్ తదుపరి చర్యలపై దృష్టిసారించారు.
తాజా పరిణామాలతో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి తర్వాత ఇది అత్యధికం. ప్రస్తుతం బ్రెంట్ ధర 2.7 శాతం పెరిగి బ్యారెల్‌కు 79.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉన్నది. అయితే అమెరికా ముడి చమురు ధర 2.8 శాతం పెరిగి 75.98 డాలర్లకు చేరుకుంది. కాగా, షేర్ మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 0.5 శాతం మధ్యస్థంగా మరియు నాస్డాక్ ఫ్యూచర్స్ 0.6 శాతం తగ్గాయి. అదేవిధంగా ఆసియా-పసిఫిక్ షేర్ల సూచీ 0.5 శాతం పడిపోయింది. జపాన్‌కు చెందిన నిక్కీ 0.9 శాతం తగ్గుదల నమోదచేసింది. యూరో స్టాక్స్ (EUROSTOXX )50 ఫ్యూచర్స్ 0.7 శాతం నష్టపోగా, ఎఫ్టీఎస్ఈ (FTSE ) ఫ్యూచర్స్ 0.5 శాతం, డాక్స్ (DAX) ఫ్యూచర్స్ 0.7 శాతం పడిపోయాయి.
హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధనానికి అత్యంత కీలకమైన ధమని వంటిది. దీనిద్వారా అత్యధికంగా చమురు రవాణా అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ చమురు, గ్యాస్ అవసరాల్లో 20 శాతం ఈ హర్మూజ్ ద్వారానే రవాణా అవుతుంది. అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ఓ ద్వీపకల్పానికి, ఇరాన్‌కు మధ్య ఈ ఇరుకైన జలసంధి ఉంది. ఈ మార్గం నుంచి రోజూ సగటున రెండు కోట్ల బ్యారెళ్ల చమురు, 29 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎల్ఎన్జీని వివిధ దేశాలకు రవాణా చేస్తారు. సౌదీ అరేబియా, ఇరాన్, అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్‌ల నుంచి ఎగుమతి అయ్యే చమురును ఈ మార్గం నుంచే పంపుతారు.
మూడింట ఒకవంతు ఎల్ఎన్జీ (ద్రవ రూపంలో ఉండే సహజవాయువు) కూడా ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. అమెరికా వైమానిక దాడుల నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ జలసంధి నుండి రవాణా అయ్యే 84 శాతం చమురు, 83 శాతం ఎల్ఎన్జీ ఆసియా మార్కెట్లకే వెళ్తుందని అమెరికా ఇంధన సమాచార సంస్థ తెలిపింది. ఇందులో 69 శాతం చమురు భారత్, చైనా, జపాన్, దక్షిణకొరియా దేశాలకు వెళ్తుంది.