న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద దాదాపు 10,700 నకిలీ రిజిస్ట్రేషన్లను అధికారులు గుర్తించారు. ఇవన్నీ రూ.10,179 కోట్ల పన్ను ఎగవేసినట్టు తేల్చారు. దేశవ్యాప్తంగా నకిలీ రిజిస్ట్రేషన్లతో పుట్టుకొచ్చిన బోగస్ కంపెనీల గుట్టు రట్టు చేసేందుకు జీఎస్టీ అధికారులు ఓ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఖజానాకు నష్టం చేకూరుస్తున్న మోసగాళ్ల పని పట్టేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూస్తుండటం గమనార్హం.
ప్రస్తుతం జరుగుతున్న రెండో విడుత డ్రైవ్.. అక్టోబర్ 15దాకా ఉండనున్నది. కాగా, 12 రాష్ర్టాల్లో ఆధార్ ఆధారిత జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను అమల్లోకి తెచ్చామని, వచ్చే నెల 4కల్లా మరో నాలుగు రాష్ర్టాల్లోనూ మొదలవుతుందని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు (సీబీఐసీ) సభ్యుడు శశాంక్ ప్రియ తెలిపారు.
అసోచామ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా కొత్త ట్యాక్స్పేయర్స్పై కొన్ని ఆంక్షలు సైతం పెడుతున్నట్టు చెప్పారు. నెలలో ఎన్ని ఇన్వాయిస్లు జారీ చేస్తున్నారన్న దానిపైనా దృష్టి పెడుతున్నట్టు తెలిపారు. అధికారులు 67,970 జీఎస్టీఐఎన్లను గుర్తించారని, ఇందులో ఈ నెల 22 నాటికి 39,965 జీఎస్టీఐఎన్లను వెరిఫై చేశామని పేర్కొన్నారు.
కాగా, రిటైలర్ల కోసం జీఎస్టీ ఈ-ఇన్వాయిసింగ్ అమలుకుగాను తెస్తున్న ఆర్కిటెక్చర్ డిజైన్ దాదాపు సిద్ధమైందని జీఎస్టీ నెట్వర్క్ సీఈవో మనీశ్ కుమార్ సిన్హా తెలిపారు. త్వరలోనే బీ2సీలో దీన్ని తెస్తామన్నారు. అంతకుముందు పైలట్ ప్రాజెక్టుగా ఆచరణలోపెట్టి పరిశీలించనున్నట్టు అసోచామ్ కార్యక్రమంలో సిన్హా వెల్లడించారు.