హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): సుప్రీం కోర్టు తీర్పుతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపునకు అడ్డంకులు తొలిగిపోయాయని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఇండ్ల స్థలాల విషయంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు న్యాయం చేస్తారని చెప్పారు. ఇప్పటివరకు ఇండ్ల స్థలాల కేటాయింపు జరగని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మంగళవారం సమాచార భవన్లో అల్లం నారాయణను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సీఎం కేసీఆర్‌ను కలిసి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించేలా ప్రయత్నిస్తానని వారికి హామీ ఇచ్చారు. అల్లం నారాయణను కలిసినవారిలో స్టీరింగ్ కమిటీ సభ్యులు బీ గోపరాజు, భీమగాని మహేశ్వర్‌గౌడ్, ఎన్ భూపాల్‌రెడ్డి, ఎం రవీంద్రబాబు, పర్వీన్, సత్యమూర్తి, వై సునీత, సిలివేరు వెంకటేశ్ తదితరులు ఉన్నారు.