న్యూఢిల్లీ, జూన్ 13: దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ షోరూంలు వెలవెలబోతున్నాయి. వ్యాపారాన్ని భారీగా విస్తరించాలనే ఉద్దేశంతో గల్లికోక షోరూంలను నెలకొల్పిన ఆటోమొబైల్ సంస్థలు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు నిర్వహణ ఖర్చులు అధికమవగా..మరోవైపు అమ్మకాలు పడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి సంస్థలు. దేశవ్యాప్తంగా ఉన్న కారు డీలర్ల వద్ద రూ.51-52 వేల కోట్ల విలువైన కార్ల ఇన్వెంటరీ పేరుకుపోయింది. రిటైల్‌గా డిమాండ్ పడిపోవడం, మరోవైపు ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచేయడంతో కొనేవారు కరువయ్యారు. రోజుకొక కొత్త మాడల్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న ఆటోమొబైల్ దిగ్గజాలు..పాతవాటిని పట్టించుకోవడం లేదు.
దీనికోసం డీలర్ల ఎగబడి బుకింగ్ చేసుకొని కొనుగోలుదారులు ఆకట్టుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే వారికి మాత్రం నిరాశే ఎదురవుతున్నది. అమ్మకాలను పెంచుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయడం కూడా నిల్వలు పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. సంఖ్యపరంగా చూస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ విలువ పరంగా చూస్తే మాత్రం రికార్డు స్థాయికి చేరుకున్నది. దీంతో డీలర్ల ఆందోళన ఆకాశానికి చేరుకున్నది. గతేడాది దీపావళి సమయంలో ఇన్వెంటరీ స్టాక్ 40 నుంచి 45 రోజులు ఉండగా, గత నెలలో ఇది 34-38 రోజులకు తగ్గినప్పటికీ విలువ పరంగా చూస్తే మాత్రం భారీగా పెరిగింది.
ధరల పెరుగుదలే కారణం
ఆటోమొబైల్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచడంతో కొనుగోళ్లు చేయడానికి కస్టమర్లు జంకుతున్నారు. గడిచిన ఏడాదికాలంలో వాహన ధరలు సుమారుగా 10 శాతం వరకు అధికమయ్యాయి. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు డాలర్-రుపీ ఎక్సేంజ్ రేట్ల కారణంగా చూపించి ధరలు పెంచాల్సి వస్తున్నదని సంస్థలు చెబుతున్నాయి. కానీ, ఈ నిర్ణయంతో సామాన్యుడిని కారును దూరం చేస్తున్నాయి. ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ సమాఖ్య(ఫాడా) ఇన్వెంటరీ స్థాయి గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నదని, ప్రస్తుతం ఇది 52-53 రోజుల స్థాయిలో ఉన్నదని, దీంతో డీలర్ల నిర్వహణ ఖర్చులు అధికమై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంది.
రిటైల్ అమ్మకాల దెబ్బ
దేశవ్యాప్తంగా రిటైల్ వాహన అమ్మకాలు అంతకంతకు పడిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగినప్పటికీ, గడిచిన ఎనిమిది నెలల్లో ఇదే కనిష్ఠ స్థాయి కావడం విశేషం. హోల్‌సేల్ అమ్మకాలతో పోలిస్తే రిటైల్ సేల్స్ తగ్గాయని ఫాడా వెల్లడించింది. గత నెలలో 3,02,214 కార్లు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన దాంతో పోలిస్తే 3.14 శాతం తగ్గాయి. పెరుకుపోతున్న కార్ల నిల్వలపై డీలర్లు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కానీ, మారుతి, హ్యుందాయ్ ఉన్నతాధికారులు మాత్రం ఇన్వెంటరీలు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. మారుతి ఇన్వెంటరీ 35 రోజుల స్థాయిలో ఉన్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
కొన్ని మాడళ్లకు డిమాండ్
కొన్ని మాడళ్లను కొనుగోలు చేసేవారు కరువయ్యారు. కానీ, మరికొన్ని మాడళ్లకు మాత్రం డిమాండ్ అధికంగా ఉన్నది. వీటికోసం రెండు నుంచి మూడు నెలల వరకు వేచివుండే కస్టమర్లు ఉన్నారు. మారుతికి చెందిన ఎస్యూవీ బ్రెజ్జా, ఎర్టిగా, మహీంద్రా థార్, థార్ రోక్స్, స్కార్పియో-ఎన్ కోసం వేచిచూస్తున్నారు. మరోవైపు, ఇటీవలకాలంలో బ్యాంకులు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుండటం, ఆదాయ పన్ను ప్రయోజనాలతో భవిష్యత్తులో వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంటుందని పలువురు ఆటోమొబై దిగ్గజ నిపుణులు అంచనావేస్తున్నారు.
తక్కువ ఆదాయం కలిగిన వారికి కేంద్రం శుభవార్తను అందించడం, వరుసగా బ్యాంకులు వాహన రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తుండటంతో ఈ ఏడాది రెండో అర్థభాగం నాటికి డిమాండ్ అధికంగా ఉండే అవకాశాలున్నాయి. – కపిల్ సింగ్, నోమురా గ్లోబల్ మార్కెట్ రీసర్చ్ హెడ్