న్యూఢిల్లీ, మే 24: ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.7,897.14 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,490.05 కోట్ల లాభం తో పోలిస్తే భారీగా వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదా యం రూ.48,816.55 కోట్ల నుంచి రూ.51,085 కోట్లకు ఎగబాకింది.
దీంట్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా సంస్థకు రూ.49,352 కోట్ల ఆదాయం సమకూరింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,90,862.45 కోట్ల ఆదాయంపై రూ.23,953.15 కోట్ల నికర లాభాన్ని గడించింది. మరోవైపు, 2024 -25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.33.50 తుది డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. గతేడాది కొత్తగా 3,972 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రావడంతో మొత్తం కెపాసిటీ 79,930 మెగావాట్లకు చేరుకున్నది.