NSE Co Location Scam | ఇటీవల వెలుగు చూసిన ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కాం కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అజ్ఞాత యోగి తనను రెండు దశాబ్దాలుగా ప్రభావితం చేశారని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ సీఈవో కం ఎండీ చిత్రా రామకృష్ణ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ యోగి పేరిట ఈ-మెయిల్ సృష్టించిందీ ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణ్యన్ అని ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ తెలిపింది. ఆనంద్ సుబ్రమణ్యన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. రుగ్యజుర్సామ @ఔట్లుక్డాట్కామ్ పేరుతో క్రియేట్ చేసిన ఈ-మెయిల్ ఐడీని ఆనంద్ సుబ్రమణ్యన్ వాడారా, ఇతరులెవరైనా నిర్వహించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది. సదరు అదృశ్య యోగికి, చిత్ర రామకృష్ణకు మధ్య జరిగిన ఈ-మెయిల్స్‌లో ప్రస్తావనకు వచ్చిన షీషెల్స్ పర్యటనపైనా దృష్టి పెట్టామని పేర్కొన్నది.
ఎన్ఎస్ఈ సీఈవో కం ఎండీగా చిత్ర రామకృష్ణ సిఫారసుల మేరకు తొలుత ఆనంద్ సుబ్రమణ్యన్‌ను సంస్థ చీఫ్ స్ట్రాటర్జిక్ అడ్వైజర్‌గా, తర్వాత గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా, ఎండీ సలహాదారుగా నియమించారు. సంస్థలో పాలనాపరమైన అవకతవకలకు పాల్పడ్డారని చిత్ర, తదితరులపై ఆరోపణలు ఉన్నాయి.
నిరాకారుడైన సిద్ధ పురుషుడు, శివణ్మని తనకు మార్గదర్శకత్వం వహించారని సెబీ విచారణలో చిత్ర రామకృష్ణ చెప్పడంతో అదృశ్య యోగి పాత్ర బయటకు వచ్చింది. ఈ అంశంలో చిత్ర, ఆనంద్ సుబ్రమణ్యన్ తదితరులపై సెబీ జరిమానా విధించడంతోపాటు కఠిన చర్యలు చేపట్టింది. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కాంతోపాటు ఇతర అవకతవకలపైనా సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.