NSE Co Location Scam | నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) కో-లొకేషన్ స్కాం కేసులో ఆనంద్ సుబ్రమణ్యన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, నాటి ఎండీ చిత్ర రామకృష్ణ సలహాదారుగా ఆనంద్ సుబ్రమణ్యన్ పని చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్ కేసులో గత నెలలో చెన్నైలో ఆనంద్ సుబ్రమణ్యన్ను సీబీఐ అరెస్ట్ చేసింది.
ఎన్ఎస్ఈ మాజీ ఎండీ కం సీఈవో చిత్ర రామకృష్ణను పూర్తిగా ఆనంద్ సుబ్రమణ్యన్ ప్రభావితం చేశారని సీబీఐ ఆరోపించింది. ఆనంద్ సుబ్రమణ్యన్తో స్టాక్ ఎక్స్చేంజ్కు సంబంధించిన కీలక, అత్యంత ముఖ్యమైన సమచారాన్ని చిత్ర రామకృష్ణ షేర్ చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో విచారించడం కోసం చిత్రను కూడా సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
హిమాలయాల్లో ఉన్న యోగి సూచన మేరకే చిత్ర రామకృష్ణ కీలక నిర్ణయాలు తీసుకున్నారని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆరోపిస్తున్నది. ఆ యోగి సలహా మేరకే ఆనంద్ సుబ్రమణ్యన్ను ఎన్ఎస్ఈ ఎండీకి సలహాదారుగా చిత్ర నియమించారని కూడా ఆరోపణలు ఉన్నాయి.