UPI Service | భారత్-బహ్రెయిన్ మధ్య రియల్ టైమ్ క్రాస్ బోర్డర్ లావాదేవీలను సులభతరం చేయడానికి ఆ దేశానికి చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ వెనెఫిట్తో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్లుగా నేషనల్ పేమెంట్ లిమిటెడ్ (NIPL) సోమవారం ప్రకటించింది. దాంతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలు బహ్రెయిన్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ (EFTS)తో ముఖ్యంగా ఫారిప్లస్ సేవతో అనుసంధానించనున్నట్లు తెలిపింది. ఇది రెండు దేశాల్లోని వినియోగదారులు తక్షణం డబ్బు పంపించడంతో పాటు స్వీకరించడం వీలవుతుంది. ఫారీప్లస్ అనేది బహ్రెయిన్‌లో దాదాపు రియల్ టైమ్ బ్యాంక్ టు బ్యాంక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సేవలు అందిస్తుంది. ఇది దేశంలోని ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ (EFTS)లో భాగం.
ఈ భాగస్వామ్యం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ (CBB) మార్గదర్శకత్వంలో జరిగింది. రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ చెల్లింపు కనెక్టివిటీని బలోపేతం చేయడంలో ఈ సహకారం ఓ కీలకమైన అడుగుగా పరిగణిస్తున్నారు. రెండు దేశాల నివాసితులకు వేగవంతమైన, సమర్థవంతమైన, సరసమైన చెల్లింపులను సులభతరం చేస్తుందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థిక సేవలు ప్రోత్సహించేందుకు, అంతర్జాతీయ లావాదేవీ వ్యవస్థలను ఆధునీకరించడానికి ఈ చర్య ఒక ఉమ్మడి దృష్టిని ప్రతిబింబిస్తుంది. యూపీఐ, ఫారి+ సర్వీస్ ఏకీకరణ భారతదేశం, బహ్రెయిన్ మధ్య వ్యూహాత్మక చెల్లింపుల కారిడార్‌ను ఏర్పాటు చేస్తుందని.. ఇది దేశ మొత్తం జనాభాలో దాదాపు 30 శాతం ఉన్న బహ్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయులకు డబ్బు పంపడం, స్వీకరించడాన్ని సులభతరం, సురక్షితంగా చేస్తుందని పేర్కొన్నాయి.