NPCI – MCX | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ప్రవీణా రాయ్ తన ఉద్యోగానికి గురువారం రాజీనామా చేశారు. ఆ వెంటనే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు చేపట్టారు. ప్రవీణా రాయ్ నియామకానికి స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ గత ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. ఆమెకు ఆర్థిక సేవల రంగంలో ప్రాథమికంగా మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఆమె ఇంతకుముందు కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంకుల్లో పని చేశారు. ఎన్పీసీఐలో బిజినెస్ స్ట్రాటర్జీ, మార్కెటింగ్, ప్రొడక్ట్స్, టెక్నాలజీ, ఆపరేషనల్ డెలివరీ తదితర అంశాలను ఆమె పర్యవేక్షించారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో క్యాష్ మేనేజ్మెంట్ పోర్ట్ ఫోలియో, హెచ్ఎస్బీసీ ఆసియా – పసిఫిక్ రీజియన్ హెడ్‌గానూ, సిటీ గ్రూప్ సౌత్ ఏషియా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రవీణా రాయ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఐఐఎం అహ్మదాబాద్‌లో పీజీ చేశారు.