Reliance Clarification | ముకేశ్ అంబానీ తన కుటుంబంతోపాటు లండన్‌కు షిఫ్ట్ అవుతున్నారని వచ్చిన వార్తలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ రియాక్టైంది. ఈ వార్తలను శుక్రవారం తిరస్కరించింది. లండన్‌లో నివాసం ఉండాలని గానీ, అక్కడికి షిఫ్ట్ కావాలని కానీ ప్రణాళికలేవీ అంబానీ కుటుంబం ముందు లేవని ఓ ప్రకటనలో తెలిపింది.
లండన్‌లోని స్టోక్ పార్క్‌లో నివాసం ఉండేందుకు అంబానీ కుటుంబం ప్లాన్ చేసిందంటూ.. ఇటీవల ఒక దినపత్రికలో వచ్చిన వార్తతో సోషల్ మీడియాలో అసమంజసమైన, నిరాధారమైన వదంతులు వ్యాపిస్తున్నాయని పేర్కొన్నది. లండన్‌లో గానీ, ప్రపంచంలోని ఏ ఇతర ప్రదేశానికి గానీ నివాసాన్ని మార్చాలని తమ చైర్మన్, ఆయన కుటుంబం వద్ద ఎటువంటి ప్రణాళికల్లేవని వివరణ ఇచ్చింది.
అయితే, లండన్‌లోని స్టోక్‌పార్క్ ఎస్టేట్‌ను రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకున్నట్లు ధ్రువీకరించింది. హెరిటేజ్ ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవడానికి గోల్ఫ్, స్పోర్టింగ్ రిసార్ట్‌గా విస్తరించేందుకు ఈ ఎస్టేట్‌ను తమ సంస్థ స్వాధీనం చేసుకున్నదని రిలయన్స్ తెలిపింది.
స్థానిక ప్రభుత్వ ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఎస్టేట్‌ను అభివృద్ధి చేస్తామని వివరణ ఇచ్చింది. లండన్‌లో రూ.592 కోట్లకు రిలయన్స్ ఆ ఎస్టేట్‌ను టేకోవర్ చేసిందని, అక్కడే దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్నదని ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది.