RDAS in Railways | రైలు ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకు నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే (ఎఫ్ఎఫ్ఆర్) కీలక నిర్ణయం తీసుకున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మద్దతుతో ఓ పరికరం డెవలప్ చేస్తున్నది. దాని పేరు ‘రైల్వే డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఆర్డాస్)`.
రైలు డ్రైవర్ నిరంతరాయం విధులు నిర్వర్తిస్తూ ఉండటం వల్ల నిద్రలేమి సమస్యతో బాధ పడుతూ ఉండొచ్చు. అటువంటి వారిని అలర్ట్ చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి ఆర్డాస్ పరికరం ఉపకరిస్తుంది. నిద్ర లేమితో సంబంధిత రైలింజిన్ డ్రైవర్ కండ్లు మూత పడుతుంటే.. ఆర్డాస్ రీడ్ చేస్తుంది. అలర్ట్ చేస్తుంది. వారు నిద్ర మూడ్ లోకి వెళ్లిపోతే రైలు నిలిచిపోయేలా సంకేతాలిస్తుందని రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే (ఎన్ఎఫ్ఆర్)ను ఆర్డాస్ డెవలప్ చేయాల్సిందిగా రైల్వే బోర్డు కోరిందని సమాచారం.
రైల్వే డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఆర్డాస్) కేవలం సౌండ్ అలర్ట్‌లు జారీ చేయడం మాత్రమే కాదు.. ఆ అలర్ట్‌ను కూడా నిర్ధిష్ట టైంలో వినలేని స్థితిలోకి డ్రైవర్ వెళితే.. ఎమర్జెన్సీ బ్రేక్ కూడా వేస్తుంది. రైలుకు ఎమర్జెన్సీ బ్రేక్ వేయడానికి విజిలెన్స్ కంట్రోల్ డివైజ్‌తో ఆర్డాస్’ను అనుసంధానిస్తారని రైల్వే వర్గాలు తెలిపాయి. ‘ఆర్డాస్ పరికరం తయారీ ఇంకా డెవలప్‌మెంట్‌తోపాటు దాని పనితీరు సరిగ్గా ఉందా? అన్న అంశంపై ట్రయల్స్ దశలోనే ఉంది. ఎన్ఎఫ్ఆర్ టెక్నికల్ టీం దీనిపై బాగా కసరత్తు చేస్తోంది. మరో కొన్ని వారాల్లో సిద్ధం అవుతుందని మేం భావిస్తున్నాం’ అని పీటీఐకి రైల్వే బోర్డు వర్గాలు చెప్పాయి.
ఆర్డాస్ తయారు చేయాలని గత నెల రెండో తేదీన ఎన్ఎఫ్ఆర్ కు లేఖ రాసింది. తయారీతోపాటు ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత ప్రయోగాత్మకంగా 20 గూడ్స్ రైలు ఇంజిన్లు, ప్యాసింజర్ రైలు ఇంజిన్లలో వాడి పరీక్షిస్తారు. ఈ సిస్టమ్ పనితీరుపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సిందిగా అన్ని జోన్లను రైల్వే బోర్డు కోరింది. ఆయా జోన్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా.. అవసరమైతే మార్పులు చేర్పులు జరుగుతాయి. ఫాస్ట్ మూవింగ్ రైళ్లలో ఇటువంటి అలర్ట్ వ్యవస్థలు ఉన్నాయని ఇండియన్ రైల్వే లోకో రన్నింగ్ మెన్ ఆర్గనైజేషన్ (ఐఆర్ఎల్ఆర్ఓ) వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ పాంధీ తెలిపారు.