China Smart Phones | భారత్‌లో రూ.12 వేల లోపు విలువ గల చైనా స్మార్ట్ ఫోన్ల విక్రయంపై నిషేధం విధించాలన్న ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తేల్చేసింది. ఈ ఫోన్లను భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేయాలని చైనా మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలను కోరినట్లు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం చెప్పారు. భారత ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్‌లో దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాలన్నారు. కానీ, అందులో విదేశీ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలను మినహాయించడం కాదన్నారు.
కొన్ని చైనా బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల సంస్థలను పారదర్శకంగా వ్యవహరించాలని కోరామని రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. అదే సమయంలో సదరు చైనా కంపెనీలు విదేశాలకు ఎగుమతులు పెంచుతాయని అంచనా వేస్తున్నామన్నారు.
భారత్‌లో విక్రయించే స్మార్ట్ ఫోన్లలో రూ.12 వేల లోపు విలువ గలవి మూడో వంతు ఉన్నాయి. రూ.12 వేల లోపు విలువ గల స్మార్ట్ ఫోన్ల తయారీలో చైనా సంస్థలకు 80 శాతం వాటా ఉంది. ఫలితంగా దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు మార్కెట్ నుంచి నిష్క్రమించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విదేశీ స్మార్ట్ ఫోన్లను నిషేధిస్తారన్న వార్తలొచ్చాయి. కానీ అటువంటిదేమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది.