Apple Store | ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్.. భారత్‌లో తన తొలి ఫ్లాగ్షిప్ రిటైల్ స్టోర్ `ఆపిల్ బీకేసీ (Apple BKC)` ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో `ఆపిల్ బీకేసీ` మాల్ కొలువు దీరనున్నది. ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఈ మాల్ ఉంది.
అయితే, ఈ ఆపిల్ రిటైల్ స్టోర్ చుట్టుపక్కలా 22 బ్రాండ్ల షాప్‌లు తెరవడానికి వీల్లేదు. అంతే కాదు.. ఆపిల్ స్టోర్‌కు ఇరువైపులా అడ్వర్టైజ్మెంట్లు కూడా ప్రదర్శించడానికి కూడా వీల్లేదని ఇన్ఫర్మేషన్ అనలిటిక్స్ కంపెనీ `సీఆర్ఈ మ్యాట్రిక్స్`ను ఉటంకిస్తూ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్తా కథనం ప్రచురించింది. ఇందుకోసం ఆపిల్, జియో వరల్డ్ డ్రైవ్ మాల్ యాజమాన్యం మధ్య ప్రత్యేకమైన లీజ్ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. 11 ఏండ్ల పాటు ఈ లీజ్ అగ్రిమెంట్ అమల్లో ఉంటుంది.
మాల్లో ఆపిల్ స్టోర్ 20,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్నది. ప్రతి నెలా రూ.42 లక్షల అద్దెను చెల్లిస్తుంది ఆపిల్. మూడేండ్ల కోసారి అద్దె 15 శాతం పెరుగుతుంది. తొలి మూడేండ్లు రెవెన్యూలో రెండు శాతం షేర్, ఆ తర్వాత 2.5 శాతం షేర్.. జియో వరల్డ్ మాల్‌కు పే చేయాల్సి ఉంటుంది.
అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, ఎల్జీ, మైక్రోసాఫ్ట్, సోనీ, ట్విట్టర్, బోస్, డెల్, డెవియాలెట్, ఫాక్స్‌కాన్, గర్మిన్, హిటాచీ, హెచ్‌పీ, హెచ్‌టీసీ, ఐబీఎం, ఇంటెల్, లెనోవో, నెస్ట్, పనాసోనిక్, తోసిబా, శాంసంగ్ సంస్థల స్టోర్లు తెరవకూడదని జియో వరల్డ్ మాల్, ఆపిల్ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తున్నది.