Health Insurance | నేడు చాలామంది ఆరోగ్య బీమా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. మారుతున్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పులు, పెరిగిన కాలుష్యం ఇలా.. అనేక పరిస్థితులు ఆరోగ్య బీమా ప్రాధాన్యతను పెంచేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లేని కుటుంబాలు లేవంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ఆరోగ్య బీమాలో నో-క్లెయిం బోనస్ లాభాలెంటో తెలుసా?
ఆరోగ్య బీమా తీసుకున్నాక తర్వాతి రెన్యువల్ వరకు ఆ బీమాను ఉపయోగించకపోతే.. అందుకుగాను బీమా సంస్థలు పాలసీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలే ఈ నో-క్లెయిం బోనస్లు. వీటిలో క్యుములేటివ్ బోనస్, ప్రీమియంపై డిస్కౌంట్లుంటాయి.
తొలి సంవత్సరం ఎలాంటి క్లెయిములు లేకపోతే మలి సంవత్సరం పాలసీ తీసుకునేటప్పుడు అంతే మొత్తానికి బీమా కవరేజీ 10 శాతం మేర పెరుగుతుంది. ఉదాహరణకు రూ.20 వేలు చెల్లించి రూ.20 లక్షల పాలసీని తీసుకున్నారు. తొలి ఏడాది కాలంలో ఏ క్లెయిం చేయలేదు. దీంతో రెండో ఏడాదీ అదే రూ.20 వేలకు రూ.22 లక్షల బీమా కవరేజీ లభిస్తుంది. ఇక్కడ నో-క్లెయిం బోనస్ రూ.2 లక్షలు (10 శాతం) అన్నమాట. ఇలా తర్వాతి సంవత్సరాల్లోనూ రూ.2 లక్షల చొప్పున బీమా కవరేజీ పెరుగుతూపోతుంది. వీటినే క్యుములేటివ్ బోనస్లు అంటారు.
ప్రతి సంవత్సరం క్లెయిములు లేకపోతే ఆ పాలసీదారులకు ఇన్సూరెన్స్ సంస్థలు.. బీమా ప్రీమియంలపై రాయితీలనూ అందిస్తాయి. రెన్యువల్ సమయంలో ఈ తగ్గింపులను అందుకోవచ్చు. ఉదాహరణకు రూ.20 లక్షల ఆరోగ్య బీమాను రూ.20 వేలు పెట్టి తీసుకున్నారు. తొలి ఏడాది ఎలాంటి క్లెయిం చేయలేదు. దీంతో మీ ప్రీమియంలో 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అంటే తర్వాతి సంవత్సరం రూ.18 వేలు చెల్లిస్తే చాలు. రూ.20 లక్షల కవరేజీ వస్తుంది. ఇలా తర్వాతి సంవత్సరాలకూ నిబంధనలకు లోబడి 10 శాతం తగ్గింపులు వర్తిస్తాయి.
చిన్నచిన్న వాటికే క్లెయిములు చేస్తే ఆరోగ్య బీమా ద్వారా పొందే ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. జలుబు, దగ్గు, జ్వరాలు, ఇతరత్రా సీజనల్ వ్యాధులకు ఆరోగ్య బీమాలను ఉపయోగించుకోవడం మానేయండి. పెద్ద సమస్యలు ఎదురైతేనే బీమాను వాడుకోండి. అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడే బీమాలను తీసుకోండి. బీపీ, షుగర్ వంటివి వచ్చాక తీసుకుంటే ప్రయోజనాలకు కోతలు తప్పవు. ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు వాస్తవాలను వెల్లడించండి. ప్రీమియంలను రెగ్యులర్గా చెల్లించండి. నిజాలను దాస్తే ఇబ్బందులు తప్పవు. నో-క్లెయిం బోనస్లు.. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు, ఇండివీడ్యువల్ హెల్త్ ఇన్సూరెన్స్లకూ వర్తిస్తాయి.