న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్ఎండీసీ..తాజాగా తన ఖనిజ ధరలను మరోమారు పెంచింది. లంప్సం టన్ను ఖనిజ ధరను రూ.100, నాణ్యమైన ఖనిజం టన్ను ధరను రూ.200 పెంచింది. ఈ పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. దీంతో స్టీల్ ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోయిన స్టీల్ ధరలు ఎన్ఎండీసీ తీసుకున్న తాజా నిర్ణయంతో సామాన్యుడిపై స్టీల్ పిడుగు పడనున్నది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో లంప్సం టన్ను ధర రూ.6,100కి, నాణ్యమైన రకం టన్ను ధర రూ.5,160కి చేరుకున్నది. వరుస నెలల్లో ధరలు పెంచడం ఇది రెండోసారి. గత నెలలోనే టన్ను ఖనిజ ధరను రూ.100 పెంచిన విషయం తెలిసిందే. మరోవైపు, సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 40 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసింది. 2030 నాటికి 100 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.