NMC on Generic | జెనెరిక్ ఔషధాల వాడకం, ఫార్మా కంపెనీలతో సమావేశాలకు వైద్యుల హాజరుపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. పేషంట్లకు చౌకగా లభించే జెనెరిక్ ఔషధాలు మాత్రమే రాయాలని గతంలో ఎన్ఎంసీ ఆదేశించింది. అంతే కాదు ఫార్మా కంపెనీల సమావేశాలకూ హాజరు కావద్దని వైద్యులను ఆదేశించింది. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ప్రొఫెషనల్ కండక్ట్) రెగ్యులేషన్స్-2023 పేరుతో ఈ నెల రెండో తేదీన ఎన్ఎంసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫార్మా కంపెనీల నుంచి ఆందోళన వ్యక్తం కావడంతో జెనెరిక్ ఔషధాలను మాత్రమే రాయాలన్న, ఫార్మా కంపెనీల సమావేశాలకు వైద్యులు హాజరు కావద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపేస్తున్నట్లు తెలిపింది. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
ఈ నెల రెండో తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ నిబంధనలు పాటించని వైద్యులపై చర్యలు తప్పవని ఇంతకుముందు ఎన్ఎంసీ హెచ్చరించింది. ఈ విషయమై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ (ఐపీఏ) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్ అమలుపై పరిశీలించాలని కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయకు లేఖ రాసిన ఐఎంఏ.. ఔషధాల నాణ్యత ప్రమాణాలు తేలే వరకూ ఆ ఆదేశాల అమలు నిలిపేయాలని కోరింది.
ఈ నేపథ్యంలో ఐఏఎం ప్రతినిధులతో సమావేశమైన మాండవీయ.. ఈ నెల రెండో తేదీన ఇచ్చిన ఆదేశాల అమలును పున:పరిశీలించాలని ఎన్ఎంసీకి మాన్సుఖ్ మాండవీయ సూచించినట్లు సమాచారం. సందేహాలను నివ్రుత్తి కోసం ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్ నిలిపేయాలని నిర్ణయించినట్లు ఎన్ఎంసీ గురువారం వెల్లడించింది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకూ ఈ నియమావళి అమల్లోకి రాదని, 2002 నాటి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్స్ తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది.