స్థూలంగా మార్కెట్లో అధిక భాగం బలహీనంగా ట్రేడవుతున్నా, కొన్ని ఇండెక్స్ హెవీవెయిట్ షేర్ల బాసటతో భారత్ స్టాక్ సూచీలు అంతర్జాతీయ ట్రెండ్‌కు భిన్నంగా నిర్దిష్టశ్రేణిలో స్థిరంగా ట్రేడవుతున్నాయి. గతవారం తొలిరోజున నిఫ్టీ 17,188 పాయింట్ల కనిష్ఠస్థాయికి పడిపోయినా, జూన్ క్వార్టర్ జీడీపీ గణాంకాలు వెల్లడికానున్న నేపథ్యంలో వెనువెంటనే కోలుకుని 17,777 గరిష్ఠస్థాయిని చేరింది. అటుతర్వాత జీడీపీ డాటా నిరాశపర్చడంతో నిఫ్టీ స్వల్ప హెచ్చుతగ్గులకు లోనై చివరకు వారం మొత్తంమీద 19 పాయింట్ల క్షీణతతో 17,539 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ వడ్డీ రేట్లపై ఫెడ్ చీఫ్ పొవెల్ కఠిన సంకేతాల కారణంగా అమెరికా నుంచి జపాన్ వరకూ ప్రధాన మార్కెట్లన్నీ బాగా తగ్గాయి. మరోవైపు డాలర్ ఇండెక్స్ ఆల్‌టైమ్ గరిష్ఠం 109.7 వద్దకు చేరింది. ఈ పరిణామాలతో విదేశీ ఇన్వెస్టర్లు నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్లలో షార్ట్ పొజిషన్లు బిల్డప్ చేశారని, దీంతో ఈ వారం సూచీ ఒడిదుడుకు లకు లోనుకావచ్చని ఏంజిల్ బ్రోకింగ్ చీఫ్ అనలిస్ట్ సమీత్ చౌహాన్ చెప్పారు.
17,100-17,700 శ్రేణిలో కదలికలు
సాంకేతికంగా నిఫ్టీకి ఫాలింగ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ప్యాట్రన్ నిఫ్టీకి అవరోధం కల్గిస్తూనే ఉంటుందని, ఇది 17,700 సమీపంలో ఉన్నదని, అలాగే 17,135 సమీపంలో ఉన్న 50 వారాల మూవింగ్ ఏవరేజ్ మద్దతునిస్తుందని ఈక్విటీరీసెర్చ్ ఆసియా ఫౌండర్ మిలన్ వైష్ణవ్ తెలిపారు. ఈ వారం నిఫ్టీ 17,100-17,700 విస్త్రతశ్రేణిలో కదలవచ్చని అంచనా వేశారు. ఈ శ్రేణిని బ్రేక్చేస్తే, ఆ దిశగా ట్రెండ్ మారుతుందన్నారు. వీక్లీ చార్టుల్లో లోయర్టాప్ ఏర్పాటైనందున, ట్రెండ్ బలహీనంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు రిలయన్స్ సెక్యూరిటీస్ డెరివేటివ్ రీసెర్చ్ అనలిస్ట్ వికాశ్ జైన్ పేర్కొన్నారు. 17,200 పాయింట్ల వద్ద పటిష్ఠమైన మద్దతు ఉన్నదని, ఈ స్థాయిని కోల్పోతే 200 డీఎంఏ సంచరిస్తున్న 17,000 పాయింట్ల స్థాయి అందించబోయే మద్దతు కీలకమన్నారు. 17, 700-17,800 పాయింట్ల శ్రేణిని బ్రేక్ చేస్తే ట్రెండ్ బుల్లిష్‌గా మారుతుందన్నారు.