ఎన్ఎస్ఈ నిఫ్టీ గత వారం మొత్తంమీద 128 పాయింట్లు లాభపడి 17, 594 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ డెయిలీ, వీక్లీ చార్టుల్లో బుల్లిష్ క్యాండిల్స్ ఏర్పర్చినందున ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెపుతున్నారు. 17,300 -17,250 శ్రేణి మధ్య లోయర్ బాటమ్ ఏర్పాటు తర్వాత సూచీ పటిష్ఠంగా రివర్స్ అయినందున, మరింతగా పెరగవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ నాగ్‌రాజ్ షెట్టి అంచనా వేశారు. 200 డీఎంఏ పైకి చేరడం సానుకూలాంశమని ఈక్విటీరీసెర్చ్.ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ చెప్పారు.
నిఫ్టీ నిరోధస్థాయి 17,800
హోలీ సెలవు (మార్చి 7)కారణంగా నాలుగురోజులే ట్రేడింగ్ పరిమితమయ్యే ఈ వారంలో నిఫ్టీకి 200 డీఎంఏ నిలిచివున్న 17,400, 50 వారాల డీఎంఏ 17,350 స్థాయిల మధ్య తక్షణ మద్దతు లభించవచ్చని, 17,650పైన 17,800 నిరోధస్థాయిని చేరవచ్చని మిలన్ వైష్ణవ్ తెలిపారు. 17,350 దిగువకు తగ్గితే 17,180 పాయింట్ల వరకూ క్షీణించవచ్చని అన్నారు. 17,800 వరకూ అప్‌ట్రెండ్ కొనసాగవచ్చని నాగ్‌రాజ్ షెట్టి అంచనా వేశారు.