గత వారం పలు ప్రపంచ ప్రధాన మార్కెట్లు జరిపిన రిలీఫ్ ర్యాలీ ప్రభావం భారత్‌పై సైతం పడింది. నిఫ్టీ 183 పాయింట్ల లాభంతో 19,230 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నవంబర్ 1 నాటి సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా అట్టిపెట్టడంతో పాటు డిసెంబర్ సమావేశంలో సైతం రేట్లు పెంపు ఉండబోదన్న సంకేతాలిచ్చిన కారణంగా యూఎస్ బాండ్ ఈల్డ్స్ 5 శాతం స్థాయి నుంచి పతనంకావడం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల ర్యాలీకి పురికొల్పింది. ఓవర్‌సోల్డ్ కండీషన్ ఫలితంగా ఈ వారం సైతం పుల్‌బ్యాక్ ర్యాలీ కొనసాగవచ్చని ఈక్విటీరీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ అంచనా వేశారు. నిఫ్టీ 19,200పైన ముగియడం సానుకూల అంశమని, ఈ వారం మరో రౌండ్ షార్ట్ కవరింగ్ జరుగుతుందని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేశ్ పాల్వియా విశ్లేషించారు.
నిరోధ స్థాయి 19,400
ఈ వారం మార్కెట్ పాజిటివ్‌గా ప్రారంభమవుతుందని, ర్యాలీని తొలుత 19,400 పాయింట్ల స్థాయి నిరోధించవచ్చని మిలన్ వైష్ణవ్ తెలిపారు. ఈ స్థాయిని దాటితే 20 వారాల మూవింగ్ ఏవరేజ్ ఉన్న 19,482 పాయింట్ల వద్ద అవరోధం కలగవచ్చన్నారు. రానున్న రోజుల్లో నిఫ్టీకి 19,000, 18,780 పాయింట్ల స్థాయిలు మద్దతు ఇవ్వవచ్చని అంచనా వేశారు. షార్ట్ కవరింగ్ ర్యాలీకి 19,350-19,400 శ్రేణి వద్ద అమ్మకాల ఒత్తిడి ఏర్పడవచ్చని, తదుపరి 19,500 స్థాయిని అధిగమించడం సవాలుగా మారుతుందని రాజేశ్ పాల్వియా చెప్పారు. ఈ స్థాయిని దాటితే దీపావళికల్లా 19,800 పాయింట్ల స్థాయిని అందుకునే ఛాన్స్ ఉంటుందన్నారు. 19,200 స్థాయిని కోల్పోతే 19,000 పాయింట్ల వద్ద మద్దతు పొందవచ్చని అంచనా వేశారు.