హైదరాబాద్, డిసెంబర్ 27: ప్రభుత్వరంగ మైనింగ్ దిగ్గజాల్లో ఒకటైన నైవేలి లిగ్నైట్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీ) భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో బొగ్గు-లిగ్నైట్తోపాటు రెన్యువబుల్ ఎనర్జీ, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుకోనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం 2029-30 నాటికి వ్యాపార విస్తరణ కోసం రూ.1.25 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ వెల్లడించారు.
ఈ నిధుల్లో రూ.65 వేల కోట్లను రెన్యువబుల్ ఎనర్జీ కోసం, మరో రూ.45 వేల కోట్లు థర్మల్ విద్యు త్ ప్రాజెక్టుల కోసం, మరో రూ.15 వేల కోట్ల ను గనుల నిర్వహణకోసం ఖర్చుచేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నిధులను అంతర్గత వనరులు, దేశీయంగా పలు బ్యాంకుల వద్ద రుణాలు, సంస్థలో వాటాల విక్రయం ద్వారా సేకరించనున్నట్టు ఆయన ప్రకటించారు. రెన్యువబుల్ ఎనర్జీని నిర్వహించడానికి సంస్థ ప్రత్యేకంగా ఎన్ఎల్సీ ఇండియా రెన్యువబుల్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక సంస్థను ప్రారంభించింది. భవిష్యత్తులో ఈ సంస్థలోనే వాటాను విక్రయించాలని యోచిస్తున్నది.
నూతన వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా సంస్థ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు, వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయన్నారు. అలాగే గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లుగా నమోదైన టర్నోవర్ వచ్చే 2030 నాటికి రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం కంపెనీ 35 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా, 2030 నాటికి 104 మిలియన్ టన్నులకు చేరుకోనున్నదన్న ఆయన.. ప్రస్తుతం1,600 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుండగా, వచ్చే ఐదేండ్లలో దీనిని 10 వేల మెగావాట్లకు పెంచుకోనున్నట్టు ప్రకటించారు.