Hyundai i20 Sportz | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ ‘హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ’.. దేశీయ మార్కెట్లోకి తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ కారు ఐ20 (i20) న్యూ స్పోర్ట్జ్ (ఆప్షనల్) వేరియంట్‌ను విడుదల చేసింది. స్పోర్ట్స్ ట్రిమ్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఐ20 (i20) కారు మాన్యువల్ ట్రాన్స్ మిషన్, సింగిల్ అండ్ డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. న్యూ వేరియంట్ ఐ20 (i20) కారు ధర రూ.8.73 లక్షలకు లభిస్తుంది. స్టాండర్డ్ స్పోర్ట్జ్ ట్రిమ్ ఐ20 (i20)తో పోలిస్తే రూ.35 వేలు ఎక్కువ.
న్యూ స్పోర్ట్జ్ (ఆప్షనల్) ఐ20 కారు ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, స్పోర్ట్జ్ (ఓ), ఆస్టా, ఆస్టా (ఓ) వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ధర రూ.7.04 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ హై ఎండ్ వేరియంట్ ధర రూ.11.21 లక్షలు పలుకుతుంది. టాటా ఆల్ట్రోజ్, మారుతి బాలెనో, టయోటా గ్లాన్జా మోడల్ కార్లతో హ్యుండాయ్ ఐ20 స్పోర్ట్స్ పోటీ పడుతుంది.
ఈ కారు స్టాండర్డ్‌గా 6-ఎయిర్ బ్యాగ్స్ తోపాటు అడాస్ మాదిరిగా అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది. హ్యుండాయ్ న్యూ వేరియంట్ ఐ20లో మూడు కొత్త ఫీచర్లు జత చేశారు. వైర్ లెస్ చార్జర్, డోర్ ఆర్మ్ రెస్ట్స్పై లెదరట్టే ఫినిష్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. హ్యుండాయ్ తన ఐ20 ఫేస్ లిఫ్ట్ కారును గత సెప్టెంబర్‌లో మార్కెట్లో ఆవిష్కరించింది.
ఎక్స్టీరియర్గా న్యూ ఐ20 వేరియంట్లో న్యూ పారామెట్రిక్ గ్రిల్లె, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తోపాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ సెటప్, రేసింగ్ స్కర్ట్ లా రీడిజైన్డ్ బంపర్ డిజైన్ చేశారు. న్యూ ఐ20లో ఫాగ్ ల్యాంప్స్ లేకున్నా ఎయిర్ డామ్ అప్డేట్ చేశారు. బాయ్‌నెట్‌పై 3డీ లోగో ఉంటుంది. 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో మరింత స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది. న్యూ హ్యుండాయ్ ఐ20 కారు ఆరు సింగిల్, 2 డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్ గ్రే, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, స్టారీ నైట్, ఫెరీ రెడ్, అట్లాస్ వైట్ + బ్లాక్ రూఫ్, ఫెరీ రెడ్ + బ్లాక్ రూఫ్ ఉంటాయి.
హ్యుండాయ్ న్యూ ఐ20 కారు క్యాబిన్ బ్లాక్ అండ్ డ్యుయల్ టోన్ గ్రే థీమ్ బేస్డ్గా వస్తున్నది. స్టిల్ ఫీచర్ సాఫ్ట్ టచ్ మెటీరియల్‌తో సెమీ లెదర్ అప్ హోల్ స్టరీతో సీట్లు రీప్లేస్ చేశారు. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్, వైర్ లెస్ చార్జింగ్ ప్యాడ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 7-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఎయిర్ ప్యూరిఫయర్, యాంబియెంట్ లైటింగ్, సెమీ లెదరట్టే సీట్లు, లెదరట్టే డోర్ ఆర్మ్ రెస్ట్, లెదర్ రాప్డ్ డీ-కట్ స్టీరింగ్ వీల్, టైప్-సీ చార్జర్, మల్టీ లాంగ్వేజ్ వాయిస్ కమాండ్ సహా 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి.
న్యూ హ్యుండాయ్ ఐ20 కారు 1.2 లీటర్ల 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 83.13 హెచ్‌పీ పవర్, 115 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 6-స్పీడ్ ఐవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఇంకా 40కి పైగా సేఫ్టీ ఫీచర్లతో వస్తున్నది హ్యుండాయ్ ఐ20 ఫేస్ లిఫ్ట్. టాప్ వేరియంట్ కార్లలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎం), 3-పాయింట్ సీట్ బెల్ట్స్, చైల్డ్ ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ యాంకర్ సీట్స్, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్, రేర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఉంటాయి.