TRAI New Rules | స్పామ్ కాల్స్, మెసేజ్‌ల ఆట కట్టించేందుకు టెలికం రెగ్యులేటరీ అధారిటీ (ట్రాయ్) కొత్త నిబంధనలను అమలులోకి తేనున్నది. స్పామ్ కాల్స్, ఎస్ఎంఎస్లకు ఫిల్టర్ చేయాలన్న ట్రాయ్ నిబంధనలను అమలు చేయడానికి దేశీయ టెలికం సంస్థలు `ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత స్పామ్ ఫిల్టర్స్` టూల్ వాడాల్సిన అవసరం ఉంది. ఫ్రాడ్స్టర్లు, వేధింపుల నుంచి కన్జూమర్లను కాపాడేందుకు ఏఐ స్పామ్ ఫిల్టర్స్ టూల్ వాడకం ముఖ్యమైన చర్య అని ట్రాయ్ స్పష్టం చేసింది. సోమవారం నుంచి స్పామ్/స్కామ్ కాల్స్ అండ్ మేసేజ్‌లను నియంత్రించడానికి టెలికం సంస్థలు `ఏఐ స్పామ్ ఫిల్టర్` వాడుతున్నాయి.
తమ కస్టమర్లకు వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసుల్లో ఫ్రాడ్ కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించడానికి ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం సంస్థలు `ఏఐ స్పామ్ ఫిల్టర్స్` వాడాలని ట్రాయ్ నిబంధనల సారాంశం. ఈ `ఏఐ ఆధారిత స్పామ్ ఫిల్టర్`లతో విభిన్న మార్గాల్లో వచ్చే స్పామ్, ప్రమోషనల్ కాల్స్ అండ్ మెసేజ్‌లను గుర్తించి..నిరోధించవచ్చు (ఫిల్టర్ చేయొచ్చు). స్పామ్ కాల్స్ అండ్ మేసేజ్‌లతో మొబైల్ ఫోన్ యూజర్లు అసౌకర్యానికి గురవుతున్న కేసులు పెరిగిపోతున్నాయి. మొబైల్ యూజర్లకు అసౌకర్యాన్ని నివారించడమే `ఏఐ ఆధారిత స్పామ్ ఫిల్టర్` లక్ష్యం.
ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా ఏఐ ఫిల్టర్ సర్వీస్‌ను వాడేందుకు ఎయిర్టెల్, రిలయన్స్ జియో తదితర టెలికం సంస్థలు నిర్ణయానికి వచ్చాయి. `ఏఐ ఫిల్టర్ సర్వీస్` వినియోగిస్తామని అధికారిక ప్రకటన ద్వారా ఎయిర్టెల్ ప్రకటించింది. త్వరలో ప్రారంభిస్తామని జియో పేర్కొంది.
ఫేక్ కాల్స్, మెసేజ్‌లను కూడా కట్టడి చేయాలని టెలికం సంస్థలను ట్రాయ్ కోరింది. 10-డిజిట్ మొబైల్ ఫోన్లకు ప్రమోషనల్ కాల్స్ పంపడం నిలిపేయాలని పేర్కొంది. ఇలా చేయడం వల్లే స్పామర్లు, మోసగాళ్లు ఆయా 10-డిజిట్ మొబైల్ ఫోన్లకు తరుచుగా కాల్స్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
కస్టమర్లు తమకు కాల్ చేసే వారిని గుర్తించడానికి `కాలర్ ఐడీ` ఫీచర్ వాడాలని టెలికం సంస్థలను కేంద్రం కోరింది. `కాలర్ ఐడీ` ఫీచర్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్‌తోపాటు సదరు వ్యక్తి పేరు, ఫొటో మొబైల్ స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది. కానీ, వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) కారణాల రీత్యా `కాలర్ ఐడీ` ఫీచర్ వాడేందుకు జియో, ఎయిర్టెల్ వంటి టెలికం సంస్థలు నిరాసక్తత వ్యక్తం చేశాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం, ట్రాయ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.