న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: నానాటికీ విస్తరిస్తున్న దేశీయ ఆన్లైన్ గేమింగ్ రంగం.. కొత్త రెగ్యులేటరీ కిందికి వెళ్లబోతున్నది. ఎప్పట్నుంచో వేచిచూస్తున్న ఆన్లైన్ గేమింగ్ నిబంధనలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు బుధవారం ప్రకటించింది. వచ్చే నెల మే 1 నుంచి ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ రూల్స్ అమల్లోకి వస్తాయని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ విలేకరులకు తెలిపారు. దీంతో గేమింగ్ ఎకోసిస్టమ్‌లో పారదర్శకత, జవాబుదారీతనం, యూజర్ల భద్రత వంటివి పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. ఆన్లైన్ గేమింగ్ సంస్థల కార్యకలాపాలు, డాటా, కంటెంట్‌పైనా నియంత్రణ ఉంటుందని ఇండస్ట్రీ విశ్లేషకులు అంటున్నారు.
ఈ క్రమంలోనే కొన్ని ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలై, మోసాల బారినపడి అమాయకులు చనిపోతున్న దృష్ట్యా రూల్స్ కఠినంగానే ఉండాల్సిన అవసరం ఉందని కూడా వారు అభిప్రాయపడుతుండటం గమనార్హం. ఇదిలావుంటే రియల్ మనీ గేమ్స్కాని చాలా ఆన్లైన్ గేమ్స్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదన్నారు కృష్ణన్. అయితే ఈస్పోర్ట్స్కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్నారు. మొత్తానికి తాజాగా విడుదలైన ఈ నిబంధనల నేపథ్యంలో భారతీయ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ రానున్నది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దీనికి చైర్‌పర్సన్‌గా ఉంటారు. ఇందులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కేంద్ర హోం, ఆర్థిక, క్రీడ, న్యాయ తదితర కీలక మంత్రిత్వ శాఖల జాయింట్ సెక్రటరీలు వ్యవహరిస్తారు.