కొచ్చి, ఆగస్టు 15: దేశంలో అత్యంత వేగవంతంగా దూసుకుపోతున్న మధ్యస్థాయి స్పోర్ట్స్ యుటిలిటీ వాహన సెగ్మెంట్లో అగ్రస్థానం లక్ష్యంగా మహీంద్రా అండ్ మహీంద్రా అడుగులు వేస్తున్నది. ఈ విభాగంలో ఇప్పటికే పలు మాడళ్లను విడుదల చేసిన సంస్థ.. తాజాగా ఐదు డోర్లు కలిగిన థార్ రాక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1997-2184 సీసీ సామర్థ్యంతో రూపొందించిన ఈ కారులో ఐదుగురు కూర్చోవడానికి వీలుంటుంది. ఈ మాడల్ ప్రారంభ ధర రూ.12.99 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.20.49 లక్షలకు లభించనున్నది. ఈ నయా మాడల్‌కు అక్టోబర్ 3 నుంచి బుకింగ్‌లు ఆరంభించనున్న సంస్థ.. దసరా (అక్టోబర్ 12) నుంచి బుకింగ్ చేసుకున్నవారికి అందచేయనున్నది. వచ్చే మూడు నుంచి ఐదేండ్లలో తొలి స్థానం లక్ష్యంగా థార్ రాక్స్ మాడల్‌ను ప్రవేశపెట్టినట్లు మహీంద్రా ఈడీ, సీఈవో రాజేశ్ జేజురికర్ తెలిపారు. ఈ నూతన మాడల్‌ను అభివృద్ధి చేయడానికి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి సంస్థ రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఈ మాడల్‌ను దేశీయంగా మాత్రమే విక్రయించనున్నట్లు, ఎగుమతి చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టంచేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 15: బంగారం దిగుమతులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో పసిడి దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 4.23 శాతం తగ్గి 12.64 బిలియన్ డాలర్లకు పడిపోయాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అంతర్జాతీయ దేశాలు అనిశ్చిత పరిస్థితి నెలకొనడం ఇందుకు కారణమని తన నివేదికలో పేర్కొంది. అధిక ధరల కారణంగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి సామాన్యుడు వెనుకడుగు వేస్తున్నారని, దీంతో దిగుమతులు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. వచ్చేది పండుగ సీజన్ కావడంతో మళ్లీ దిగుమతులు పెరిగే అవకాశం ఉన్నదని తెలిపింది. బంగారంతోపాటు వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశీయ అతిపెద్ద విమానయాన రంగ సంస్థ ఇండిగోలో మహిళా పైలట్లు మరింత పెరగనున్నారు. ప్రస్తుతం 800 మందికిపైగా మహిళా పైలట్లు పనిచేస్తున్నారీ సంస్థలో. అయితే వచ్చే ఏడాది ఆగస్టుకల్లా మరో 200 మందిని నియమించుకుంటామని, వెయ్యి మంది మహిళా పైలట్లే తమ లక్ష్యమని గురువారం సంస్థ తెలియజేసింది. రోజూ 2 వేలకుపైగా విమాన సర్వీసులను ఇండిగో నడిపిస్తున్నది. సంస్థలో 5 వేలకుపైగా పైలట్లున్నారు.