Luxury Home Prices |దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరాల్లో నివాసం ఉండటానికి సెలబ్రిటీలు.. రాజకీయ, ఆర్థిక, సినిమా, వాణిజ్య రంగ ప్రముఖులు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇక కార్పొరేట్ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు మెరుగైన వసతులు ఉన్న ప్రాంతాల్లోనే ఉండటానికే మొగ్గు చూపుతుంటారు. అందుకే ఢిల్లీ, ముంబై నగరాల్లో లగ్జరీ ఇండ్ల ధరలకు రెక్కలొచ్చేస్తున్నాయి. 44 ప్రధాన అంతర్జాతీయ నగరాలతో పోలిస్తే లగ్జరీ ఇండ్ల ధరల్లో న్యూఢిల్లీ ఆరో స్థానం, ముంబై ఏడో స్థానంలో నిలిచాయని ప్రముఖ రియాల్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది. 2023-24తో పోలిస్తే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సగటున ఇండ్ల ధరలు 6.7 శాతం పెరిగాయి. గత డిసెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 44 నగరాల ఇండ్ల ధరలను విశ్లేషిస్తూ నైట్ ఫ్రాంక్ ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ4 2024’ అనే పేరుతో నివేదిక విడుదల చేసింది.
స్థానిక కరెన్సీ ధరలతో పోలుస్తూ నైట్ ఫ్రాంక్ ఈ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం ప్రపంచ దేశాల్లోనే దక్షిణ కొరియా రాజధాని సియోల్ మొదటి స్థానంలో నిలుస్తుంది. సియోల్‌లో ఇండ్ల ధరలు 18.4 శాతం పెరిగితే, మనీలాలో 17.9 శాతం, దుబాయిలో 16.9, టోక్యోలో 12.7, నైరోబీలో 8.3 శాతం పెరిగాయి. గత 12 నెలల్లో న్యూఢిల్లీలో ఇండ్ల ధరలు ఇంప్రెసివ్‌గా 6.7 శాతం పెరిగాయి. లైఫ్ స్టైల్ మెరుగు పడటంతోపాటు ఆర్థికంగా బలోపేతం కావడం దీనికి కారణం. అంతకుముందు అక్టోబర్ త్రైమాసికంలో 16వ స్థానంలో నిలిచిన ఢిల్లీ.. డిసెంబర్ త్రైమాసికానికి ఆరో స్థానానికి దూసుకెళ్లడం ఆసక్తికర పరిణామం.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత ఏడాది కాలంలో ఇండ్ల ధరలు 6.1 శాతం పెరిగాయి. బెంగళూరులో ఇండ్ల ధరలు 4.1శాతం వృద్ధితో 23వ ర్యాంక్ సాధించింది. అంతర్జాతీయంగా 44 నగరాల పరిధిలో గత ఏడాది కాలంలో ఇండ్ల ధరలు సగటున 3.2 శాతం పెరిగాయి. 44 నగరాలకు 34 నగరాల్లో ఇండ్ల విక్రయాల్లో పాజిటివ్ ధొరణి నెలకొంది. లైఫ్ స్టైల్ అప్‌గ్రేడ్ కావడంతోపాటు దేశీయ ఆర్థిక వృద్ధిరేటు పుంజుకోవడం ఇండ్ల విక్రయాలు పెరగడానికి కారణం అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ చెప్పారు. మున్ముందు కూడా ఇండ్ల విక్రయాల్లో సానుకూల ధోరణితో ఇండ్ల ధరలు మరింత పెరుగుతాయన్నారు.