Net Direct Tax | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 15.88 శాతం వృద్ధి చెందాయి. 2024 ఏప్రిల్ నుంచి ఈ నెల 12వ తేదీ వరకూ సుమారు రూ.16.90 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. నాన్ కార్పొరేట్ పన్నులు.. ప్రధానంగా వ్యక్తిగత ఆదాయం పన్ను రూ.8.74లక్షల కోట్ల పై చిలుకు వసూలైందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 12వరకూ నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు సుమారు రూ.7.68లక్షల కోట్లు అని వెల్లడించింది. నెట్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్ టాక్స్ (ఎస్టీటీ) రూపేణా రూ.44,538 కోట్లు వసూలైందని సీబీడీటీ తెలిపింది. ఇదే కాలంలో టాక్స్ రీఫండ్స్ 42.49 శాతం వృద్ధితో రూ.3.74లక్షల కోట్లకు చేరుకున్నాయి.
గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈనెల 12 వరకూ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20 శాతం వృద్ధితో రూ.20.64 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.22.07లక్షల కోట్లు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.10.24లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయం పన్ను, ఇతర పన్ను వసూళ్లు రూ.11.87 లక్షల కోట్లు ఉంటాయని కేంద్రం అంచనా వేసింది.