న్యూఢిల్లీ, జూలై 11: ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఈ నెల 10దాకా దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు దాదాపు రూ.5.63 లక్షల కోట్లుగానే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే వ్యవధితో పోల్చితే 1.34 శాతం క్షీణించాయి. నాడు రూ.5.70 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందుకు కారణం అధిక రిఫండ్సేనని శుక్రవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూలై 10 వరకు నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు సుమారు రూ.2 లక్షల కోట్లుగా ఉన్నాయి.
వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థల ద్వారా జరిగిన నాన్-కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్స్ రూ.3.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక సెక్యూరిటీస్ లావాదేవీ పన్ను వసూళ్లు రూ.17,874 కోట్లుగా ఉన్నట్టు తేలింది. నికర రిఫండ్స్ 38 శాతం పెరిగి రూ.1.02 లక్షల కోట్లుగా నిలిచాయి. దీంతో స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.65 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.25.20 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది.