కోల్‌కతా, ఏప్రిల్ 24 : మదుపరులకు అవగాహన, బాధ్యతల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్తూ.. పెట్టుబడులు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్ని నియమనిబంధనలున్నా రక్షణ లభించదని బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి అన్నారు. ‘మీ ట్రేడింగ్ మీకున్న అవగాహనను, మీ అవగాహన మీ ట్రేడింగ్‌ను ప్రతిబింబించాలి. లేకపోతే మీరు సమస్యల్లో పడతారు’ అని గురువారం ఇక్కడ కలకత్తా చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ‘రిటైల్ భాగస్వామ్యం’ అంశంపై మాట్లాడుతూ చెప్పారు. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. వదంతులను నమ్మి మదుపరులు పెట్టుబడులకు దిగుతుండటాన్ని విమర్శించారు. అలాగే మదుపరులు నష్టపోయినప్పుడు రెగ్యులేటర్లను నిందించడం, అదే మదుపరులు లాభాలను అందుకున్నప్పుడు వారి తెలివితేటల్ని ప్రశంసించడం సరికాదన్నారు. ఈ క్రమంలోనే మదుపరులంతా ఎవరికివారు వ్యక్తిగతంగా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే రెగ్యులేటర్లు కూడా ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. నష్టాలు తప్పవని హెచ్చరించారు.
మార్కెట్ తీరుతెన్నులపై అవగాహనలేని చిన్న మదుపరులు.. మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవాలని రామమూర్తి ఈ సందర్భంగా సూచించారు. అలాగే మహిళలు, యువత కెరియర్ తొలినాళ్ల నుంచే పెట్టుబడులను ప్రారంభించాలన్నారు. ఇక ఎస్ఎంఈలు స్టాక్ మార్కెట్లలో తక్కువగా నమోదవుతున్నాయని, వ్యాపారాభివృద్ధికి కావాల్సిన నిధుల సమీకరణ కోసం ఈక్విటీల్లోకి ప్రవేశాన్ని ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చారు. స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించే సామర్థ్యం 1,000కిపైగా ఎస్ఎంఈలకు ఉన్నా.. 40 మాత్రమే ట్రేడ్ అవుతుండటం నిరాశపరుస్తున్నదని చెప్పారు. ఎస్ఎంఈ లిస్టింగ్‌ల్లో అక్రమాలను కొట్టిపారేయలేమన్న ఆయన చర్యలు తీసుకుంటున్నామన్నారు.