ఓవైపు కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయం. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్ఠాత్మక టై (ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్-టీఐఈ) గ్లోబల్ సమ్మిట్. ఇంకోవైపు దేశ, విదేశాల నుంచి వ్యాపార రంగ ప్రముఖులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులు వస్తున్నారు. వీటన్నిటి మధ్య అన్ని అపోహలను పటాపంచలుచేస్తూ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సమ్మిట్ భారీ సక్సెస్‌ను సాధించింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): టై గ్లోబల్ సమ్మిట్‌కు ఊహకు అందని రీతిలో అద్భుతమైన స్పందన వచ్చిందని నిర్వాహకుల్లో ముఖ్యు లు, సదస్సు వైస్ చైర్మన్ మురళీ బుక్కపట్నం ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ స్టార్టప్ ఎకో సిస్టం (అనుకూల వాతావరణం), ప్రభుత్వ ప్రోత్సాహం, పాలసీలపట్ల ఆహుతులు ఎంతో సంతృప్తిని కనబర్చినట్టు చెప్పారు. తమ లక్ష్యాలను చేరుకునేందుకు ఇలాంటి వేదికలు, ఈ తరహా అనుకూల వాతావరణం కావాలని వారంతా ఆకాంక్షించినట్టు తెలిపారు. నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళీ బుక్కపట్నం ఇంకా ఎమన్నారంటే..
టై గ్లోబల్ సమ్మిట్‌లో కార్యక్రమాలు, వాటి ప్రత్యేకతలు ఏమిటి?
మురళీ: ఈ సదస్సులో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. వ్యాపారాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, నూతన ఆలోచనలకు పెద్దపీట వేస్తున్నాం. ముఖ్యంగా రెండోరోజు ఇన్వెస్టర్ కనెక్ట్, స్టార్టప్ షోకేస్, నర్చర్ పెవిలియన్లతోపాటు ఫలక్‌నుమా, చార్మినార్ ఆడిటోరియంలలో 40 అంశాలపై దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ప్రధాన వెంచర్ క్యాపిటలిస్టులతో చర్చా కార్యక్రమాలు జరిగాయి. సుమారు 3వేలకుపైగా వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ఔత్సాహిక వ్యాపారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు పాల్గొని ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు.
కలారి క్యాపిటల్ వేదికగా ఏం జరుగుతోంది?
మురళీ: కలారి క్యాపిటల్ అంటే వెంచర్ క్యాపిటలిస్టులు. స్టార్టప్ కంపెనీల్లో పెద్ద మొత్తంగా పెట్టుబడులు పెట్టేవారు. ఈ సదస్సులో వీరంతా సుమారు వంద స్టార్టప్‌ల అనుభవాలను, విజయగాథలను ఇక్కడి స్టార్టప్‌ల నిర్వాహకులకు తెలియజేశారు. పరస్పర చర్చల కోసం కలారి క్యాపిటల్ మీటప్ అనే కార్యక్రమాన్నీ నిర్వహించాం. ఒకేసారి వంద స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటలిస్టులు ఇలా కలవడం అనేది అత్యంత కీలకమైన ఘట్టం.
ఔత్సాహికులకు మీరిచ్చే సందేశం?
మురళీ: సొంత ఐడియాలను డెవలప్ చేసుకోవాలి. ఇతరులను అనుసరించకూడదు. మీ ఆలోచనకు ఎంతవరకు మార్కెట్ ఉందన్న అంశాన్ని అంచనా వేయగలగాలి. దానికి టెక్నాలజీ తోడైతే విస్తృతమైన మార్కెట్ ఉంటుంది.
ఈ సదస్సు ముఖ్యోద్దేశం ఏమిటి?
మురళీ: టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్. సరికొత్త వ్యాపార ప్రపంచాన్ని సృష్టించడం. ఒక స్టార్టప్ విజయవంతమయ్యేందుకు అవసరమైన అన్ని అవకాశాలను కల్పించడమే టై గ్లోబల్ సమ్మిట్ లక్ష్యం. ఆ దిశగా మేము విజ యం సాధించామని చెప్పవచ్చు. మేము అనుకున్న దానికంటే ఎక్కువమంది వచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎలా ఉన్నది?
మురళీ: చాలా బాగుంది. తాము ఆశించిన దానికంటే ఎక్కువగానే ప్రోత్సాహం లభిస్తున్నది. వ్యాపారవేత్తలను, స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న పాలసీలు ఈ రంగాల్లోని వారికి ఎంతో ఊపునిచ్చేలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని స్టార్టప్ ఎకో సిస్టంపై మంత్రి కేటీఆర్ ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన తర్వాత చాలామందిలో ఎంతో ఆత్వవిశ్వాసం పెరిగింది.
ఎంతమంది వెంచర్ క్యాపిటలిస్టులు ఈ సమ్మిట్‌కు వచ్చారు?
మురళీ: దేశ, విదేశాలకు చెందిన సుమారు 120 వెంచర్ క్యాపిటలిస్టులు వచ్చారు. ఒక్క వేదికపైకి ఒకేసారి ఇంతమంది రావడం చాలా అరుదు. ఇది వేలాది స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్నిచ్చింది. వెంచర్ క్యాపిటలిస్టులకు తమ ఆలోచనలు, ప్రయోగాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ వేదిక స్టార్టప్ నిర్వాహకులకు ఎంతో కలిసొస్తున్నది.