ముంబై, జనవరి 9: మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ స్కీముల్లోకి వచ్చే పెట్టుబడులు గత నెలలో 14 శాతానికిపైగా పెరిగాయి. డిసెంబర్లో రూ. 41,156 కోట్లకు చేరాయి. నిజానికి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం విశేషం. కాగా, చిన్న, మధ్యతరహా మ్యూచువల్ ఫండ్స్ స్కీములు మదుపరులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. దీంతో గత నెల రికార్డు స్థాయికి పెట్టుబడులు వెళ్లాయని భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సంఘం (యాంఫీ) తాజాగా తెలియజేసింది.
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) మదుపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నవంబర్‌తో చూస్తే డిసెంబర్లో సిప్‌ల్లోకి పెట్టుబడులు రూ.25,320 కోట్ల నుంచి రూ.26,459 కోట్లకు పెరిగాయి. దీంతో సిప్ నిర్వహణలోని మొత్తం ఆస్తులు రూ.13.63 లక్షల కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో ఇది దాదాపు ఐదో వంతుకు సమానం. గత ఏడాది డిసెంబర్ 31నాటికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు రూ.66.93 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే నవంబర్ 30న ఇవి రూ.68.08 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా, స్టాక్ మార్కెట్లు దిద్దుబాటు దిశగా వెళ్లడంతో డెట్ స్కీముల నుంచి రూ.1.27 లక్షల కోట్ల పెట్టుబడులను మదుపరులు వెనక్కి తీసుకున్నారని, దానివల్లే ఈ తగ్గుదల అని యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని తెలిపారు.
సమీప భవిష్యత్తులో దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితుల్నే చూస్తామని యాంఫీ సీఈవో వెంకట్ చలసాని చెప్తున్నారు. అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ వస్తుండటం.. మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. ప్రతీకార సుంకాలు ప్రభావం చూపవచ్చన్న అంచనాలున్నాయి. అయితే దేశీయ మదుపరులు స్టాక్స్‌లో పెట్టుబడులపట్ల ఆసక్తితోనే ఉంటారన్న అభిప్రాయాన్ని చలసాని వ్యక్తం చేశారు. సిప్ పెట్టుబడులు.. స్టాక్ మార్కెట్లపై ఇన్వెస్టర్లకున్న ఉన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాయన్నారు.
అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు డిసెంబర్లో మొత్తం 33 కొత్త ఫండ్లను ఆఫర్ చేశాయి. వీటి ద్వారా రూ.13,643 కోట్లకుపైగా నిధులను సమీకరించాయి. అంతకుముందు నెల నవంబర్‌లో 18 స్కీములు పరిచయమవగా, రూ.4,000 కోట్ల నిధుల సమీకరణే జరిగినట్టు యాంఫీ తాజాగా ప్రకటించింది. ఇదిలావుంటే థీమ్యాటిక్ కేటగిరీ డిసెంబర్లో రూ.15,331 కోట్ల పెట్టుబడుల్ని అందుకున్నది. నవంబర్‌లో ఇది రూ.7,658 కోట్లే. ఇక మిడ్‌క్యాప్ కేటగిరీలోకి రూ.5,093 కోట్లు, స్మాల్‌క్యాప్ రూ.4,667 కోట్లను పొందాయి. బడా స్కీముల్లోకి రూ.2,010 కోట్లు వచ్చాయి. గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌ల్లోకి రూ.640 కోట్ల పెట్టుబడులు వచ్చాయని యాంఫీ సీఈవో చలసాని చెప్పారు.