న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్ల నాణ్యత కోసం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. విదేశాల నుంచి నాసిరకం సీలింగ్ ఫ్యాన్ల దిగుమతులకు అడ్డుకట్ట వేయడం, దేశీయంగా నాణ్యమైన ఎలక్ట్రిక్ ఫ్యాన్ల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఈ నిబంధనల్ని తెచ్చామని ఇటీవలి ఓ నోటిఫికేషన్లో పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రగతి శాఖ (డీపీఐఐటీ) పేర్కొన్నది. తమ ఈ నిర్ణయంతో దేశీయంగా ఫ్యాన్ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభించడమేగాక.. క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్, ప్రోడక్ట్ మాన్యువల్స్ అభివృద్ధికీ వీలుంటుందని అభిప్రాయపడింది.
బీఐఎస్ మార్క్ ఉండాల్సిందే
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) మార్క్ లేని విద్యుత్తు ఆధారిత సీలింగ్ రకం ఫ్యాన్లను ఉత్పత్తి, అమ్మకం, వాణిజ్యం, దిగుమతి, నిల్వ చేయరాదని తాజా ఆదేశంలో డీపీఐఐటీ స్పష్టం చేసింది. కాగా, నోటిఫికేషన్ విడుదలైన 6 నెలలదాకా నిబంధనల అమలుకు వెసులుబాటు కల్పించినట్టు చెప్పింది. దీంతో ఈ నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక దేశీయంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను దృష్టిలో పెట్టుకొని ఏడాదిపాటు గడువిచ్చారు. ఫలితంగా ఎంఎస్ఎంఈలకు వచ్చే ఏడాది ఆగస్టు 9 నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. నిజానికి ప్రస్తుతం బీఐఎస్ సర్టిఫికేషన్ రూల్స్.. ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్స్‌కు వర్తించడం లేదు. కానీ వాటిని ఇకపై తప్పనిసరి చేస్తున్నారు.
రెండేండ్ల జైలుశిక్ష, జరిమానాలు
బీఐఎస్ చట్టం నిబంధనల్ని ఉల్లంఘించినవారికి రెండేండ్లదాకా జైలుశిక్ష పడుతుందని నోటిఫికేషన్లో డీపీఐఐటీ తెలిపింది. అయితే ఈ నేరానికి పాల్పడటం తొలిసారేనని తేలితే మాత్రం కనీసం రూ.2 లక్షల జరిమానాతో వదిలేయనున్నారు. ఒకవేళ మళ్లీమళ్లీ నేరం చేసినట్టు రుజువైతే జైలుశిక్షలు తప్పవు. కనీస జరిమానా రూ.5 లక్షలకు పెరుగుతుంది. అలాగే దొరికిన నాసిరకం వస్తూత్పత్తుల విలువకు 10 రెట్లు అధికంగా కూడా ఫైన్లుండవచ్చు.