న్యూయార్క్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ట్విట్టర్ బోర్డులో చేరకూడదని ఎలన్ మస్క్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ సీఈవో, భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ట్విట్టర్లో అతిపెద్ద భాగస్వామిగా ఉన్నప్పటికీ.. కొన్ని ఊహించని పరిణామాల మధ్య బోర్డుకు మస్క్ దూరంగానే ఉంటున్నట్టు వివరించారు. అమెరికాకు చెందిన ఈ మైక్రోబ్లాగింగ్, సోషల్ నెట్వర్కింగ్ సంస్థలో ప్రపంచంలోనే ధనవంతుడైన ఎలన్ మస్క్‌కు అత్యధికంగా 9.2 శాతం వాటా ఉన్నది. దీంతోనే 2024 వరకు ట్విట్టర్ బోర్డులో మస్క్‌కు సభ్యత్వం లభించింది. ఈ నెల 9నే బోర్డులో చేరాల్సి ఉన్నది. అయితే చేరకూడదని అదే రోజున మస్క్ నిర్ణయించుకున్నట్టు అగర్వాల్ తాజాగా తెలిపారు. ఇందుకు సంబంధించిన కారణాలను మాత్రం ఆయన తెలియపర్చలేదు. అయినప్పటికీ ఆయన రాక కోసం ట్విట్టర్ తలుపులు తెరిచే ఉంటాయన్నారు. నిజానికి ఇటీవలికాలంలో ట్విట్టర్ ప్రగతి కోసం పెద్ద ఎత్తున సూచనల్నీ మస్క్ చేశారు. స్పేస్ఎక్స్, టెస్లా సంస్థల సారథిగా మస్క్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.